ములుగు, జూలై 19 (నమస్తే తెలంగాణ): ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయాలు చాటేలా పూజారుల ఆలోచనల మేరకే గద్దెల ప్రాంగణంలో మార్పులు లేకుండా మేడారం ఆధునీకరణ పనులను చేపడుతామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. శనివారం హైదరాబాద్లోని సచివాలయంలో మేడారం ఆధునీకరణపై రాష్ట్ర స్థాయి అధికారులతో సీతక్క సమీక్ష నిర్వహించారు. సమ్మక్క-సారలమ్మ ప్రధాన గద్దెలలో ఎలాంటి మార్పులు చేయకుండా పరిసరాలను భక్తుల ఆకాంక్షల మేరకు, పూజారుల సూచనల మేరకు విషాలంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. తల్లుల ధీరత్వాన్ని ప్రతిబింబించేలా గద్దెల ప్రాంగణాన్ని, పరిసరాలను నిర్మిస్తామని చెప్పారు. వారం రోజుల్లో గద్దెల చుట్టూ ఆధునీకరణ పనులు చేపట్టేందుకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తామని అన్నారు. పూజారుల ఆమోదం అనంతరం పనులను ప్రారంభిస్తామని సీతక్క వెల్లడించారు. సమావేశంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్, కమిషనర్ వెంకట్రావ్, ములుగు కలెక్టర్ టీఎస్ దివాకర, ఏటూరునాగారం ఐటీడీఏ పీవో చిత్రామిశ్రా, మేడారం పూజారులు, అధికారులు పాల్గొన్నారు.