Minister Seethakka | వరంగల్, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఇసుక మరోసారి దందాకు కేంద్రమైంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇసుక విషయంలో అనుసరిస్తున్న విధానాలు కొందరికి కాసులు కురిపిస్తున్నాయి. ఇసుకతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం అధికార పార్టీలోని కొందరు ముఖ్యులకు చేరుతున్నది. ప్రభుత్వ అనుమతి ఉన్న ఇసుక రీచ్‌లను కాంగ్రెస్ ప్రభుత్వం మూసి వేసింది. గడువు పొడిగింపు, కొత్త పాలసీ అనే కారణాలను చెప్పి అధికారికంగా ఇసుక విక్రయాలను నిలిపివేసింది. ఇదే అదనుగా అధికార పార్టీలోని కీలక ప్రజాప్రతినిధులు ఇసుకను ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండున్నర నెలలే అవుతున్నా… రెండు వారాల క్రితం నుంచే ఈ దందా పెరిగింది.
తెలంగాణ స్టేట్ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇసుక తవ్వకాలు, వ్యాపారం జరుగుతుంది. రాష్ట్రంలో 40 వరకు ప్రభుత్వ అనుమతి ఉన్న ఇసుక రీచ్‌లు ఉన్నాయి. వీటి నుంచి ప్రతిరోజు సగటున 80 వేల టన్నుల ఇసుక వ్యాపారం జరుగుతున్నది. కొత్త ప్రభుత్వం రాగానే పారదర్శకంగా ఉన్న పాత పద్ధతిని నిలిపివేసింది. అధికారికంగా ఇసుక రీచ్‌లలో తవ్వకాలను బంద్ పెట్టింది. ప్రభుత్వంలోని ఇద్దరుముగ్గురు ముఖ్య ప్రజాప్రతినిధులు వారి నియోజకవర్గాల పరిధిలోని గోదావరి నదిలో ఇసుక రీచ్‌ల నుంచి ఇసుకను ఇష్టం వచ్చినవారు తీసుకువెళ్లేలా ఏర్పాట్లు చేశారు. అధికారికంగా రీచ్‌లను నిలిపివేయడంతో ప్రభుత్వానికి ఆదాయం రావడంలేదు. ఇక్కడ కీలక ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో అక్రమంగా ఇసుక తవ్వకాలు, రవాణా జరుగుతున్నాయి.
విజిలెన్స్-ఎన్ఫోర్స్మెంట్ విభాగం తనిఖీల్లో అక్రమ దందా బయటపడుతున్నది. రీచ్‌లను మూసివేయడంతో రెండువారాలుగా రాష్ట్రంలో ఇసుకకు డిమాండు పెరిగి ధరలు పెరుగుతున్నాయి. ఇదే అదనుగా ప్రభుత్వంలోని ఇద్దరుముగ్గురు ముఖ్యులు ఇసుక దందాకు తెరలేపారు. ప్రభుత్వానికి వచ్చే కోట్ల రూపాయల ఆదాయాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. ‘నమస్తే తెలంగాణ’లో వస్తున్న వరుస కథనాలతో వరంగల్ ఉమ్మడి జిల్లాలోని మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) ప్రైవేటు పీఏ సుజిత్‌రెడ్డి బండారం బయటపడింది. విజిలెన్స్-ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్న లారీలను వదిలిపెట్టేలా సుజిత్‌రెడ్డి ఒత్తిడి తెచ్చారనే ఆరోపణలతో ఆయనను తాత్కాలికంగా పక్కనబెట్టినట్టు పైకి చెప్తున్నారు.
ఒక సాధారణ పీఏ ఉన్నత స్థాయి అధికారులపై ఒత్తిడి తేవడంవెనుక ఉన్న బలం ఏమిటనే చర్చ జరుగుతున్నది. ప్రభుత్వ పెద్దల అండతోనే సుజిత్‌రెడ్డి ఇసుక అక్రమ దందాలో కీలకంగా వ్యహరించినట్టు తెలుస్తున్నది. సీఎం రేవంత్‌రెడ్డి కోటరీలో మంత్రి సీతక్క మొదటి నుంచి కీలకంగా ఉంటున్నారు. ప్రస్తుత మంత్రివర్గంలోనూ సీతక్క కీలకపాత్రలో ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని రోజులకే కీలక మంత్రి పీఏ ఇసుక దందాలో బహిరంగంగా దొరికిపోవడంపై కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతున్నది. ఉన్నతస్థాయిలో ఉన్న అండదండలతోనే ఇసుక వ్యవహారంలో సీతక్క పీఏ కీలకంగా వ్యవహరించాడని అధికార పార్టీ నేతలు చెప్తున్నారు.
సిరిసిల్ల జిల్లాకు చెందిన సుజిత్‌రెడ్డి అమ్మమ్మ ఊరు ములుగు మండలం దేవగిరిపట్నం. సీతక్క ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సోషల్ మీడియాను అస్త్రంగా చేసుకుని సుజిత్‌రెడ్డి ఆమె వద్ద చేరాడు. నడుస్తున్న ట్రెండ్ మొత్తం సోషల్ మీడియానే అని చెప్పి కొందరితో ప్రైవేటు సైన్యాన్ని తయారు చేశాడు. సీతక్క ఎటు వెళ్లినా ఆ సైన్యాన్ని వెంట పంపించి వీడియోలు, ఫొటోలు తీసి వాటికి పాటలను జోడించి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్టు చేస్తుంటారు. కొన్ని రోజులకే సుజిత్‌రెడ్డి సీతక్కకు పీఏగా మారిపోయాడు. కరోనా సమయంలో సీతక్కకు సోషల్ మీడియాలో విస్త్రృత ప్రచారం కల్పిస్తానని తెలుపుతూ పరిచయం పెంచుకున్నాడు.
సోషల్‌మీడియా బృందానికి నెల ప్యాకేజీల చొప్పున అందిస్తూ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసేవాడు. కరోనా సమయంలో గ్రామాలు, గూడేల్లో సీతక్కతోపాటు సుజిత్‌రెడ్డి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్టు తీసిన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేసేవి. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన నేత ముఖ్య సన్నిహితులతో నేరుగా సంబంధాలు నెరుపుతూనే పీఏగా పని చేస్తూ వచ్చాడు. సీతక్క మంత్రి కాగానే దందా మొదలుపెట్టాడని అంటున్నారు. సీతక్క మంత్రి అయిన తర్వాత హైదరాబాద్ లెవల్లో దందాలకు తెరలేపడమే కాకుండా సీఎం పేరును, ఆయన ఫొటోలను ఇసుక లారీలకు సర్దార్ అంటూ స్టిక్కరింగ్లు వేయించి కోట్ల దందాకు తెరతీశాడు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొన్ని రోజుల్లోనే ములుగు నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు సైతం ఆశ్చర్యపోయేలా బిజినెస్ మ్యాన్‌గా మారిపోయాడు. లారీకి అడ్డువచ్చిన అధికారులకు ఫోన్లు చేసి వదలాలని హుకుం జారీ చేశాడు. సుజిత్‌రెడ్డి తీరు మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉన్నదని కాంగ్రెస్ నేతలే అంటున్నారు. సీతక్కకు పీఏగా మారిన తర్వాత సుజిత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యనేతలతో సంబంధాలు పెంచుకున్నాడు. సీఎం రేవంత్‌రెడ్డి సైతం సుజిత్‌రెడ్డిని పేరు పెట్టి పిలిచేంత పరిచయం పెరిగింది. సీతక్క వెంట ఉంటూ సేవ పేరుతో కాంట్రాక్టర్లు, వ్యాపారుల నుంచి డబ్బులు వసూళ్లు చేయడం సుజిత్రెడ్డికి పరిపాటి అని చెప్తున్నారు.
ములుగు నియోజకవర్గంలోని కాంగ్రెస్ ముఖ్యనేతలతో సీతక్కకు మధ్య దూరం పెంచడంలో సుజిత్ ముఖ్యపాత్ర వహించాడని అంటున్నారు. చివరికి సీతక్క కుటుంబ సభ్యులు ఆమెను కలిసేందుకు వస్తే సుజిత్‌రెడ్డి అడ్డుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. కాంగ్రెస్‌లో ఏ స్థాయి నేతలైనా, అధికారులు అయినా మంత్రి సీతక్కను కలవాలంటే ముందుగా సుజిత్రెడ్డితో మంచిగా ఉండాలనే విధంగా పరిస్థితి మారిందని అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మంత్రి సీతక్కకు గవర్నమెంట్ పీఏగా తనను నియమించాలనే ప్రతిపాదన పెట్టాడు. నిబంధనలు అడ్డురావటంతో సీఎం ఆఫీస్ పీఏను అని చెప్పి అధికారులకు ఫోన్లు చేసేవాడు. ఇదే ప్రక్రియలో విజిలెన్స్-ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు ఫోన్లు చేసి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న లారీలను వదిలిపెట్టాలని ఒత్తిడి తెచ్చాడు.
ప్రస్తుతం కాళేశ్వరం వద్ద గల 8 క్వారీల నుంచి ఇసుక రవాణా జరుగుతున్నది. కాళేశ్వరం ఏరియాలోని పలుగుల (విలాసాగర్ 3) క్వారీని నుంచి ఇసుక తరలింపును నిలిపివేయడంపై లారీ యజమానులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్వారీలో నాణ్యమైన ఇసుక ఉన్నదని, కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కై ఈ క్వారీని కావాలనే మూసివేశారని ఆరోపిస్తున్నారు. కాళేశ్వరం ఏరియాలోని క్వారీలపై ఆధిపత్యం చెలాయిస్తున్న ఒక అధికారి, ప్రభుత్వ పెద్దల అండదండలతో ఇసుక కృత్రిమ కొరత సృష్టిస్తున్నాడని, అతని కనుసన్నల్లో అక్రమ దందా యధేచ్ఛగా కొనసాగుతున్నదని చెప్తున్నారు. ఇసుకను తీసుకెళ్లేందుకు బుకింగ్‌తో వచ్చిన ప్రతిలారీ నుంచి రూ1000 చొప్పున వసూలు చేస్తున్నారని అంటున్నారు.
ప్రతిరోజు 350 లారీలు ఈ క్వారీకి వస్తున్నాయని, ఇలా సగటున రూ.3.50 లక్షల వరకు ముట్టజెప్పాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రభుత్వంలోని ముఖ్యుల అండతోనే ఆ అధికారి ఇలా చేస్తున్నాడని, హైదరాబాద్‌లోని ఉన్నతాధికారికి సైతం ఫిర్యాదు చేసినా ఫలితం లేదని వాపోతున్నారు. ములుగు జిల్లాలోని 102 ఎకరాల్లో 11 ఇసుక క్వారీలను మైనింగ్ శాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది. కేసీఆర్ ప్రభుత్వ హయంలో పీసా గ్రామ సభలను నిర్వహించి ఆదివాసీ సంఘాలు, నిబంధనల మేరకు ఇతరులకు ఈ క్వారీలను కేటాయించారు.
మంగపేట మండలం మల్లూరు, చుంచుపల్లిలో… వాజేడు మండలం అయ్యవారిపేట, ధర్మవరం, రాంపూర్‌లో… వెంకటాపురం (నూగూరు) మండలం మొర్రివానిగూడెం, శ్రీరంగపురం, కే కొండాపురం, వంటి చింతగూడెంలో క్వారీలు ఉన్నాయి. ప్రస్తుతం వెంకటాపురం (నూగూరు) మండలంలో రెండు క్వారీలు, వాజేడు మండలంలో మూడు క్వారీలు కొనసాగుతున్నాయి. 19 లక్షల 56 వేల 666 టన్నుల సామర్థ్యంతో ఇసుక క్వారీలను నిర్వహిస్తున్నారు. పీసా గ్రామ సభల ఆమోదం లభించకపోవడంతో క్వారీలు ఇసుక కొరత ఏర్పడుతున్నదని మైనింగ్ శాఖ అధికారులు చెప్తున్నారు. మేడారం జాతర సందర్భంగా రవాణా ఇబ్బందులు లేకుండా వరంగల్-ములుగు-ఏటూరునాగారం రోడ్డులో ఇసుక లారీల రవాణాను నిలిపివేయాలని అధికారులు నిర్ణయించారు. జాతర ముగిసే వరకు ఈ మార్గంలో ఇసుక రవాణా జరిగే అవకాశం లేదు. ఇది ఇసుక అక్రమ వ్యాపారం చేసేవారికి మంచి అవకాశంగా మారింది.