హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ) : పాఠశాల్లో మాదిరిగానే అంగన్వాడీ కేంద్రాల్లోనూ ఉదయం 9 గంటలకు గంట మోగించాలని, అందుకు సంబంధించి జిల్లా వెల్ఫేర్ అధికారులు(డీడబ్ల్యూవోలు) చర్యలు తీసుకోవాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. అంగన్వాడీల పురోగతి, పనితీరుపై శుక్రవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అంగన్వాడీలకు సొంతభవనాల నిర్మాణం, తాగునీటి కనెక్షన్లు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. విధుల్లో అలసత్వం పనికిరాదని సూచించారు.
అంగన్వాడీల్లో పోషకాహారాన్ని ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని, నాసిరకం వస్తువులు వస్తే వెంటనే తిరిస్కరించి, పంపిణీదారులపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రజాప్రతినిధులు.. బడిబాట మాదిరిగానే అంగన్‌వాడీబాట పట్టాలని సూచించారు. కొన్ని జిల్లాలో మూతబడిన అంగన్వాడీలను తక్షణమే తెరిపించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మహిళాభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభ, టూ రిజం కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, డైరెక్టర్ కాంతి వెస్లీ, వయోవృద్ధులు వికలాంగుల సాధికారత శాఖ జేడీ శైలజ, సంక్షేమ అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో పని చేస్తున్న కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్ల(సీఆర్టీలు)కు ప్రతి నెలా 5 లోగా జీతాలు విడుదల చేయనున్నట్టు మంత్రి సీతక్క తెలిపారు. మహిళా టీచర్లకు 180 రోజులు ప్రసూతి సెలవులతోపాటు డెత్ బెనిఫిట్స్ మంజూరు చేస్తామని చెప్పారు. ఈ మేరకు శుక్రవారం సెక్రటేరియట్లో సీఆర్టీలతో చర్చలు జరిపారు.
సావిత్రీబాయి ఫూలే జయంతి సందర్భంగా జ్యోతిబాఫూలే ప్రజాభవన్‌లో ఆమె చిత్రపటానికి మంత్రి సీతక్క నివాళి అర్పించారు. అనంతరం 25 మంది లబ్ధిదారులకు సంచార చేపల విక్రయ వాహనాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా సర్కారు అందజేస్తున్న వాహనాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.