హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల కురిసిన వర్షాలు బీభత్సం సృష్టించాయి. చాలా ప్రాంతాల్లో రోడ్లు, కల్వర్టులు దెబ్బతిన్నాయి. ఈ మేరకు పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం అధికారులు నష్టం అంచనా వేశారు. శనివారం వరకు అందిన సమాచారం ప్రకారం పంచాయతీరాజ్ విభాగానికి చెందిన 124 ప్రాంతాల్లో 84.97 కిలోమీటర్ల మేర గ్రామీణ రహదారులు దెబ్బతిన్నాయని వెల్లడించారు. తాతాలిక మరమ్మతులకు రూ. 6.02 కోట్లు, శాశ్వత పునరుద్ధరణకు రూ.141.68 కోట్లు.. మొత్తం రూ.147.70 కోట్లు అవసరమవుతాయని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్కకు నివేదిక సమర్పించారు.
ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా వేగంగా పునరుద్ధరణ చర్యలు తీసుకోవాలని అధికారులను సీతక ఆదేశించారు. పునరుద్ధరణ పనులపై రోజూ సమీక్షిస్తున్నట్టు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం అధికారులు.. దెబ్బతిన్న రోడ్ల సమాచారాన్ని సేకరించి, తాతాలిక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. గ్రామాల్లో శిథిలావస్థకు చేరిన ఇండ్లలో నివసిస్తున్న ప్రజలను ఖాళీ చేయించి, సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్ర స్థాయిలో ఈఎన్సీ కార్యాలయంలో ఫ్లడ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. రోడ్లు, కల్వర్టులు కూలినా.. గండ్లు పడ్డా టోల్‌ఫ్రీ నంబర్ 040-3517 4352కు సమాచారం ఇవ్వాలని సూచించారు. మంచినీటి సరఫరాలో అంతరాయం కలుగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.