ములుగు, ఆగస్టు 13 (నమస్తేతెలంగాణ): ములుగు జిల్లా కేంద్రంలోని బండారుపల్లి గురుకుల పాఠశాలకు చెందిన పదోతరగతి విద్యార్థి వేల్పుల కార్తీక్ ఈ నెల 2న పాముకాటుకు గురై హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న మంత్రి సీతక్క మంగళవారం నిమ్స్‌కు వెళ్లి కార్తీక్ కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న కార్తీక్ వద్దకు చేరుకొని ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు.
ఐదుగురు విద్యార్థినులకు అస్వస్థత
గొల్లపెల్లి, ఆగస్టు 13: జగిత్యాల జిల్లా గొల్లపల్లిలోని మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో ఐదుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. పెద్దాపూ ర్ గురుకుల పాఠశాలలో జరిగిన ఘటన మరువకముందే మరోసారి ఇలా జరగడంతో విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. పాఠశాలలో పదోతరగతి చదువుతున్న భవ్యశ్రీ, శ్రీజ, తొమ్మిదో తరగతి విద్యార్థినులు అమిత, శ్రావ్య, రిషిత మంగళవారం మధ్యాహ్నం హాస్టల్లో భోజనం చేశారు. తర్వాత పం ద్రాగస్టు సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన ఆటల పోటీల్లో పాల్గొనేందుకు మైదానానికి చేరుకున్నారు. పీఈటీ సునీత ఖోఖో ఆడిస్తుండగా, మొదట భవ్యశ్రీ అ స్వస్థతకు గురైంది. అనంతరం మరో నలుగురు అస్వస్థతకు గురయ్యారు. అప్రమత్తమైన ప్రిన్సిపాల్ సుష్మిత సదరు విద్యార్థినులను జగిత్యాల దవాఖానకు తరలించారు. విద్యార్థినులు శ్వాస సంబంధిత సమస్య తో బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. భయాందోళనకు గురైన వారి తల్లిదండ్రులు దవాఖానకు చేరుకున్నారు.