రామారెడ్డి/కామారెడ్డి, నవంబర్ 20: కామారెడ్డి జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి సీతక్క.. రైతులనుద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. సకాలంలో బోనస్ ఇవ్వాలని, పంట కొనుగోళ్లు చేయాలని డిమాండ్ చేసిన అన్నదాతలను.. ‘అసలు మీరు రైతులేనా?’ అంటూ అవహేళన చేశారు. అంతేకాకుండా ‘రైతులు తాగుబోతులు’ అంటూ పరుషంగా వ్యా ఖ్యానించారు. సీతక్క వ్యాఖ్యలపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తమను కించపరిచేలా మాట్లాడిన మంత్రి సీతక్క క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఉన్న సీతక్కతోపాటు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ గురువారం కామారెడ్డి జిల్లా పర్యటనకు వచ్చారు. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన మలావత్ పూర్ణ తండ్రి ఇటీవల మృతి చెందగా, ఆమెను పరామర్శించేందుకు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలానికి రామారెడ్డి మీదుగా బయల్దేరారు. మంత్రి వస్తున్న విషయం తెలిసి రైతులు రామారెడ్డిలోని కొనుగోలు కేంద్రం వద్ద ఆమె కాన్వాయ్‌ను అడ్డుకున్నారు.
కారు దిగిన సీతక్కకు వినతిపత్రం సమర్పించి తమ బాధలు చెప్పుకొన్నారు. గత యాసంగిలో బోనస్ ఇవ్వలేదని, రైతుబంధు, రైతుబీమా సక్రమంగా అమలు కావడంలేదని వివరించారు. ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతున్నదని, కాంటాలు కావడం లేదని, సకాలంలో డబ్బులు రావడం లేదని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలు వివరిస్తున్న రైతులపై మంత్రి సీతక్క అసహనం వ్యక్తంచేశారు. ‘సమస్యలు ఉంటే వచ్చి కలవాలి.. ఇలా రోడ్డు మీద కాన్వాయ్‌ను ఆపడం సరికాదు.. మీరు బీఆర్ఎస్ నాయకుల్లా ఉన్నారు, అసలు మీరు రైతులేనా?’ అంటూ మంత్రి చిటపటలాడారు. ప్రభుత్వం రైతులకు బోనస్ ఇస్తున్నదని మంత్రి చెప్పబోగా, తమ మండలంలో రాలేదని రైతులు తెలిపారు. కావాలంటే అధికారులను వివరాలు అడిగి తెలుసుకోవాలని సూచించారు.
పోలీసులు వచ్చి రైతులను పక్కకు తీసుకెళ్లడంతో మంత్రి అక్కడినుంచి వెళ్లిపోయారు. అనంతరం మంత్రి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మార్కెట్ యార్డులో నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో సీతక్క మాట్లాడుతూ.. రైతులను ఉద్దేశించి మరోసారి అనుచిత వ్యాఖ్యాలు చేశారు. తాను మలావత్ పూర్ణను పరామర్శించడానికి వెళ్తుంటే, రామారెడ్డి మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు, మరికొందరు కలిసి మద్యం సేవించినవారితో వచ్చి అకస్మాత్తుగా తమ వాహనానికి అడ్డుపడ్డారని చెప్పారు. వాహనం కింద పడి చచ్చిపోతే ఎవరు బాధ్యులని ప్రశ్నించారు. ఇలాంటి వందిమాగధులకు బుద్ధి రాకపోతే ఎలా? అని ప్రశ్నించారు. తాము పరామర్శకు వెళ్తుంటే నలుగురిని వేసుకొని వచ్చి రైతుల పోరాటం అంటున్నారని, వారికి అసలు భూములేలేవని వ్యాఖ్యానించారు. డ్రామా కంపెనీల వాళ్లు వచ్చి తనను అడ్డుకున్నారని హేళన చేశారు.
మంత్రి సీతక్క వ్యాఖ్యలను నిరసిస్తూ రామారెడ్డిలోని తెలంగాణతల్లి విగ్రహం వద్ద గురువారం రాత్రి రైతులు నిరసన వ్యక్తంచేశారు. రైతులను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను మంత్రి సీతక్క వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని రైతులు డిమాండ్ చేశారు. రామారెడ్డిలో సానుకూలంగా స్పందించిన మంత్రి, కామారెడ్డి వెళ్లిన తరువాత కించపరిచేలా మాట్లాడటం, రైతులు తాగి కాన్వాయ్‌కు అడ్డంగా వచ్చారని అనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు కాన్వాయ్‌ను అడ్డుకున్నాడని మంత్రి చెప్పారని, కానీ అసలు ఆయన ఇక్కడకు రానేలేదని రైతులు స్పష్టంచేశారు. గిరిజన బిడ్డ అయిన సీతక్క.. మాల, మాదిగలను హేళన చేసేలా మాట్లాడారని మండిపడ్డారు. పూర్తి సమాచారం తెలువకుండా మిడిమిడి జ్ఞానంతో రైతులను బీఆర్ఎస్ నాయకులని అనడం, ఆరుగురిపై కేసులు నమోదు చేయించడం మంత్రికి తగదని చెప్పారు.
మంత్రి సీతక్క కాన్వాయ్‌ను అడ్డుకున్నారన్న అభియోగంపై ఆరుగురు రైతులపై పోలీసులు కేసు నమోదు చేశారు. రామారెడ్డి మండల బీఆర్ఎస్ నాయకులు పడిగల శ్రీనివాస్, మాజీ ఎంపీపీ నారెడ్డి దశరథ్‌రెడ్డి, ఉప్పల్వాయి మాజీ సర్పంచ్ కొత్తొల్ల గంగారం, బాలదేవ్ అంజయ్య, ద్యాగల మహిపాల్, హన్మయల్లా రాజయ్యపై కేసు నమోదు చేసినట్టు ఎస్పీ రాజేశ్చంద్ర ఓ ప్రకటనలో తెలిపారు.