Seethakka | హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ) : వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కొత్త పింఛన్లను అమలు చేయ డం లేదని శాసనమండలిలో మంత్రి సీతక్క మంగళవారం స్పష్టంచేశారు. గత సర్కారు హయాంలో అమలు చేసిన పింఛన్ విధానాన్నే తమ ప్రభుత్వంలోనూ అమలు చేస్తున్నామని తెలిపారు. తమ మ్యానిఫెస్టోలో పెట్టిన విధంగా పిం ఛన్లను పెంచేందుకు ఇంకా మూడేండ్ల వరకు సమయం ఉన్నదన్నారు. అంటే అప్పటి వరకు పాత పింఛన్లే అమలవుతాయని ఆమె చెప్పకనే చెప్పారు. శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్సీ కవిత లేవనెత్తిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చే క్రమంలో మంత్రి సీతక్క ఈ మేరకు కీలక వ్యాఖ్యలు చేశా రు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు పింఛన్ల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునే కార్యక్రమం ఇంకా ప్రారంభం కాలేదని, వెబ్సైట్ సరిగా పని చేయడం లేదని చెప్పారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తుల మేరకు కలెక్టర్ల విచక్షణ ప్రకారం మానవీయ కోణంలో వృద్ధులు, దివ్యాంగులకు కలిపి కొత్తగా 45 వేల మందిని పింఛన్ల జాబితాలో చేర్చినట్టు తెలిపారు. దివ్యాంగులకు రూ.6 వేలు ఎప్పుటి నుంచి ఇస్తారు? అన్న ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వకుండా మంత్రి దాటవేసే ప్రయత్నం చేశారు.
మిషన్ భగీరథ కొనసాగుతున్నది
బీఆర్ఎస్ హయాంలో ప్రవేశ పెట్టిన మిషన్ భగీరథ పథకం పేరిటే ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలకు మంచి నీటిని సరఫరా చేస్తున్నామని మంత్రి సీతక్క తెలిపారు. ప్రస్తుతం గ్రామీణ, గిరిజన ప్రాంతాలతో పాటు తండాల్లోనూ తీవ్ర మంచినీటి ఎద్దడి ఏర్పడిందని, ఆయా ప్రాంతాలో ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించారు. అయితే మంచినీటి కనెక్షన్లు సరిగా లేక పోవడం వంటి ఇతర కారణాలతో మంచినీటి లభ్యత కొరవడిందని తెలిపారు.