హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): గిరిజన ప్రాంతాల్లో గ్రామపంచాయతీ భవనాలు, బీటీ రోడ్లు, గురుకులాల నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని, పనుల నాణ్యత విషయంలో రాజీపడొద్దని రాష్ట్ర స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశించారు. ఎకడైనా భూమి సమస్యలుంటే కలెక్టర్లు, ఐటీడీఏ పీవో దృష్టికి తీసుకొచ్చి సమన్వయంతో పనులు చేయాలని సూచించారు. శనివారం హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని డీఎస్‌ఎస్‌భవన్‌లో గిరిజన ఇంజినీరింగ్ అధికారులతో ఆమె ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వరింగ్ సీజన్‌కు మూడు నెలలున్న నేపథ్యంలో సాధ్యమైనంత తొందరగా పనుల అంచనాలను తెప్పించుకొని, వాటికి 15 రోజుల్లో టెండర్లను పిలిచి అగ్రిమెంట్స్ చేసుకోవాలని ఆమె ఆదేశించారు.
7 వర్సిటీల్లో గిరిజన యువతకు హాస్టల్ నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.140 కోట్లు కేటాయించిందని, ఈ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఒకో పంచాయతీ భవనానికి రూ.20 లక్షల చొప్పున రూ.600 కోట్లు విడుదల చేసిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో రోడ్డు కనెక్టివిటీలేని ప్రాంతం ఉండకూడదని, 78 నియోజకవర్గాల్లోని 2,090 గిరిజన ఆవాసాలకు బీటీ రోడ్లు నిర్మించేందుకు ప్రభుత్వం రూ.1500 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. అధికారుల్లో అలసత్వాన్ని సహించేది లేదని, నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తూ, స్పెషల్ సెక్రటరీ శ్రీధర్, అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్‌రెడ్డి, జాయింట్ డైరెక్టర్ కల్యాణ్‌రెడ్డి సహా ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు, ఇంజినీరింగ్ విభాగం అధికారులు పాల్గొన్నారు.