హైదరాబాద్ : దళితుల జీవితాల్లో వెలుగులు నింపి, పేదరికాన్ని శాశ్వతంగా నిర్మూలించేందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. భూపాలపల్లి జిల్లా ఇల్లందులో జిల్లా ఎస్సీకులాల సహకార సంఘం ఆధ్వర్యంలో జరిగిన దళితబంధు పథకం అవగాహన కార్యక్రమంలో పాల్గొని, మాట్లాడారు.
పథకానికి ఎంపికైన లబ్ధిదారులు లాభసాటి వ్యాపారాలు చేసుకుంటూ గొప్పగా ఎదగాలని సూచించారు. రాష్ట్రంలో పొరుగున ఏపీలో ఉన్న అమూల్ నుంచి లక్ష లీటర్ల పాలను కొంటుందని, ప్రతి నెలా వందల కోట్ల టర్నోవర్ ఉందని, కర్నాటక డెయిరీ నుంచి 20లక్షల లీటర్లు మహిళా శిశు సంక్షేమ శాఖ కోసం తీసుకుంటున్నట్లు చెప్పారు. పాలకు భారీ డిమాండ్ ఉందని, నిత్యవసరాల డిమాండ్ రోజురోజుకు పెరుగుతుందన్నారు. దళితబంధు కింద ఇస్తున్న యూనిట్లను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో మూడు తరాలు వెనక్కి వెళ్లామని, దీన్ని మార్చాలనే గొప్ప సంకల్పంతో సీఎం కేసీఆర్ పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు. ప్రజల అవసరాలు తెలిసిన వ్యక్తి మనకు సీఎం కావడం అదృష్టమని, ఆయనకు మరింత శక్తిని ఇవ్వాలని ప్రార్థిస్తున్నానన్నారు. కార్యక్రమంలో జడ్పీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, కలెక్టర్ భవేష్ మిశ్రా, ఆయాశాఖల అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.