MLC Jeevan Reddy | హైదరాబాద్, అక్టోబర్ 20 (నమస్తే తెలంగాణ): బతుకమ్మను అవమాన పరిచేలా మాట్లాడిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ టీ జీవన్‌రెడ్డి వెంటనే మహిళలకు క్షమాపణ చెప్పాలని మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ డిమాండ్ చేశారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. జీవన్‌రెడ్డి తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని హెచ్చరించారు. బతుకమ్మ పండుగకు అసలైన వైభవం తెచ్చింది ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితేనని స్పష్టంచేశారు. మందు బాటిళ్లు పెట్టి బతుకమ్మ ఆడాలనే వ్యాఖ్యలు అభ్యంతరకరమని చెప్పారు. శుక్రవారం తెలంగాణభవన్లోఆమె మీడియాతో మాట్లాడుతూ.. జగిత్యాలలో ఓటమి అని తెలిసే జీవన్‌రెడ్డి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జీవన్‌రెడ్డి వ్యాఖ్యలు ఒక్క ఎమ్మెల్సీ కవితనే అవమానపర్చినట్టు కాదని, తెలంగాణ మహిళా సమాజాన్ని అవమానపర్చినట్టని ఆగ్రహం వ్యక్తంచేశారు.
బతుకమ్మ పండుగపై కాంగ్రెస్ నాయకులు సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. బతుకమ్మలో మందు బాటిళ్లు, సారా బాటిళ్లు పెట్టే సంస్కృతి కాంగ్రెస్ నాయకులకు ఉన్నట్టు ఉన్నదని ఎద్దేవాచేశారు. తెలంగాణ మహిళా సమాజాన్ని, సంస్కృతి, సంప్రదాయాన్ని కాంగ్రెస్ నేతలు అవమానపరుస్తున్నారని జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ శ్రీలత ఆగ్రహం వ్యక్తంచేశారు. అనంతరం తెలంగాణభవన్ వద్ద జీవన్‌రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్ఎస్ మహిళా నాయకులు దహనం చేశారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఓటమి భయానికి తోడు వయస్సు మీద పడటంతో జీవన్‌రెడ్డికి మతి భ్రమించి మాట్లాడుతున్నారని తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడె రాజీవ్‌సాగర్ మండిపడ్డారు. తెలంగాణ సం స్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మను అవమా న పరిచే విధంగా మాట్లాడటం సిగ్గుచేటని ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు గౌరమ్మను అమ్మవారి రూపంగా పూజిస్తారని, అలాంటి గౌరమ్మ స్థానంలో లికర్ బాటిల్ పెట్టాలడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. మద్యం మత్తులో ఉండే జీవన్‌రెడ్డికి బతుకమ్మను చూసినా లికరే గుర్తుకొస్తున్నదని పేర్కొన్నారు.