మహబూబాబాద్: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు కనుమరుగవడం ఖాయమని మంత్రి సత్యవతి రాథోడ్ (Minister Satyavathi Rathod) అన్నారు. రైదుబంధు నిలిపివేయాలని, సంక్షేమ పథకాలు ఆపాలంటూ ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ (Congress) లేఖ రాయడంపై అన్నదాతలు, ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని విమర్శించారు. గిరిజనులను అవమానించిన పార్టీ కాంగ్రెస్ అని చెప్పారు. మహబూబాబాద్‌లో ఎమ్మెల్యే శంకర్ నాయక్‌తో కలిసి మంత్రి సత్యవతి మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ పాలనలో గిరిజనుల ఆత్మగౌరవం పెరిగిందన్నారు. రూ.వెయ్యి ఇచ్చి గుడుంబా పోస్తే ఓట్లేసేవారు గిరిజనులనే అహంకారపూరిత మాటలు కాంగ్రెస్ నాయకులవని చెప్పారు.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గిరిజనులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అంటే నయవంచన అని, బీఆర్ఎస్ అంటే ఒక నమ్మకమన్నారు. ఆ పార్టీని నమ్మితే మోసపోతామన్నారు. రైతులు, పింఛన్‌దారులకు కేసీఆర్ భరోసా అని, అందుకే బీఆర్ఎస్ పథకాలను కాంగ్రెస్ కాపీకొడుతున్నదని విమర్శించారు. బీఆర్ఎస్ అద్భుతమైన మేనిఫెస్టోతో ప్రజల్లోకి వెళ్తున్నదని చెప్పారు. రైతు బంధు సృష్టికర్త సీఎం కేసీఆర్ అని, వచ్చేసారి 16 వేలు ఇస్తామన్నారు. గత ప్రభుత్వాలు రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తే, సీఎం కేసీఆర్ రైతులకు డబ్బులు ఇస్తున్నారని చెప్పారు.
రూ.400లకే గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతున్నామని, సౌభాగ్య లక్ష్మి ద్వారా మహిళలకు రూ.3 వేలు,
తెల్ల రేషన్‌కార్డులు ఉన్న వారికి 6 కిలోల సన్నబియ్యం ఇస్తామన్నారు. రైతు బీమా లాగానే, కోటి కుటుంబాలకు రూ.5 లక్షల బీమా అందిస్తామని, బీఆర్ఎస్ గెలిచాక ఆసరా పింఛన్లను రూ.5 వేలు చేస్తామని తెలిపారు. ఆరోగ్య శ్రీ ద్వారా 15 లక్షల చికిత్స ఉచితంగా అందిస్తామని వెల్లడించారు. కాంగ్రెస్‌ను 11 సార్లు గెలిపిస్తే వ్యవసాయాన్ని దండుగ చేశారని, 11 సార్లు రైతుబంధు ఇచ్చి సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగలా చేశారన్నారు.