Satyavathi Rathod | మహబూబాబాద్ : ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గిరిజన,స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్( Minister Satyavathi Rathod ) స్పష్టం చేశారు. మంగళవారం మహబూబాబాద్( Mahabubabad )లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో 64 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్( CMRF Fund ) నుంచి మంజూరైన రూ. 25,07,400 విలువ గల చెక్కులను మంత్రి అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. పేద, మధ్య తరగతి ప్రజలకు ఆపత్కాలంలో సీఎం రిలీఫ్ ఫండ్ వరంలా మారిందని, ప్రజల ఆరోగ్యానికి తెలంగాణ ప్రభుత్వం భరోసా కల్పిస్తుందన్నారు. సీఎం కేసీఆర్ పేదల ఆరోగ్య పట్ల ప్రత్యేక శ్రద్ధను చూపుతున్నారని తెలిపారు. నియోజకవర్గంలో ఇప్పటికే కోట్లాది రూపాయాలను సీఎం సహాయ నిధి నుంచి అందివ్వడం జరిగిందన్నారు.
ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. గతంలో పాలకులు ఏ రోజు కూడా తెలంగాణ పేదల సంక్షేమం కోసం ఆలోచన చేయలేదని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాతే కేసీఆర్ పేదల బతుకులు మార్చాలన్న ఆలోచనతో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. భవిష్యత్తు తరాల బాగుకోసం ఆడబిడ్డలందరూ కేసీఆర్‌ను ఆశీర్వదించాలని వారికి అండగా నిలవాలని మంత్రి కోరారు.
తెలంగాణ రాకముందు రైతులు సాగునీటి కోసం ఎరువుల కోసం కరెంటు కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చేదని ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని అన్నారు. అందరి సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందన్నారు. పేద ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌కు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు. అనంతరం చెక్కులు తీసుకున్న లబ్ధిదారులు సీఎం కేసీఆర్, మంత్రి సత్యవతి రాథోడ్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంత్రి సత్యవతి రాథోడ్‌తో పాటు కొరివి జడ్పీటీసీ బండి వెంకట్ రెడ్డి, బయ్యారం పీఏసీఎస్ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, కొమ్మినేని రవీందర్, తదితరులు పాల్గొన్నారు.