మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండటంతో.. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశించారు. శుక్రవారం ఉదయం మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్లో అధికారులతో వర్షాలపై సమీక్ష నిర్వహించి పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే శంకర్ నాయక్, కలెక్టర్ అభిలాష అభినవ్, జిల్లా అటవీశాఖ అధికారి రవి కిరణ్, ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి, ఆర్డీవో కొమురయ్యతో పాటు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. గత కొద్ది రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. ఈ నెల రోజుల కాలంలోనే 50 శాతం అధికంగా వర్షపాతం నమోదైందని పేర్కొన్నారు. వర్షాల వల్ల చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో అక్కడక్కడ రహదారులు దెబ్బతిన్నాయి. వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కొన్ని చెరువులు, కుంటలు, వాగుల వద్ద బలహీనంగా ఉన్న కట్టలు తెగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో డాక్టర్లు, సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. రేపు మంత్రి కేటీఆర్ బర్త్డే సందర్భంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు.