నమస్తే తెలంగాణ నెట్వర్క్, ఆగస్టు 29: తెలంగాణలో సంక్షేమ స్వర్ణయుగం నడుస్తున్నదని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్ కితాబిచ్చారు. సీఎం కేసీఆర్ సంపదను పెంచుతూ పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారని తెలిపారు. సోమవారం మంత్రి ములుగు జిల్లాలో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలతోపాటు ఆసరా పింఛన్‌దారులకు కార్డులను పంపిణీ చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అత్యధికంగా 50 లక్షల మందికి ఆసరా పింఛన్లను అందించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందని పేర్కొన్నారు.
ఇంటింటికెళ్లి పింఛన్కార్డులిచ్చిన ఎర్రబెల్లి
మహబూబాబాబ్ జిల్లా తొర్రూరు మండలం వెలికట్ట గ్రామంలో సోమవారం కలెక్టర్ కే శశాంకతో కలిసి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పింఛన్‌దారులకు మంజూరు పత్రాలు అందజేశారు. కొందరు లబ్ధిదారుల ఇంటికి నేరుగా వెళ్లి పెన్షన్ పత్రాలను అందజేశారు. మంత్రి, కలెక్టర్, ప్రజాప్రతినిధులకు లబ్ధిదారులు పూలు చల్లుతూ మంగళహారతులు పట్టి స్వాగతం పలికారు.
మహబూబ్‌నగర్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్..
మహబూబ్‌నగర్ పట్టణంలో నూతన ఆసరా పింఛన్ కార్డులను మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ పంపిణీ చేశారు. త్వరలోనే పాత కలెక్టరేట్ స్థానంలో రూ.500 కోట్లతో సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మించనున్నట్టు మంత్రి తెలిపారు. హన్వాడ వద్ద ఫుడ్‌పార్క్ ఏర్పాటు చేసి పరిశ్రమలు స్థాపిస్తామని చెప్పారు.
ఉమ్మడి రంగారెడ్డిలో 54 వేల కొత్త పింఛన్లు
రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 54 వేల కొత్త పింఛన్లు మంజూరైనట్టు విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి చెప్పారు. సోమవారం శ్రీనగర్‌కాలనీలోని తన నివాసంలో కొత్త పింఛన్ కార్డులను ఆవిష్కరించారు. వచ్చేనెల రెండు నుంచి జిల్లావ్యాప్తంగా పంపిణీ చేస్తామని చెప్పారు.
ఖమ్మంలో 2 లక్షల మందికి పింఛన్లు
ఖమ్మం జిల్లాలో ఇకపై ప్రతినెలా రెండు లక్షల మందికి ఆసరా పింఛన్లు అందుతాయని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం, ఖమ్మం నగరం పాండురంగాపురంలో కలెక్టర్ వీపీ గౌతమ్‌తో కలిసి ఆసరా గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. దేశంలో ఇంత పెద్ద మొత్తం పింఛన్ల రూపంలో పేదల కోసం ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనన్నారు.
చిన్నారి రిత్వికకు ఆసరా
జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రానికి చెందిన పుట్టుకతో అంధురాలైన ఐదేళ్ల కావటి రిత్వికకు వికలాంగుల పింఛన్ మంజూరైంది. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో ఐడీ కార్డు, పింఛన్ మంజూరు ధ్రువపత్రాన్ని అందుకున్నది. ‘నాకు కేసీఆర్ తాత పైసల్ పంపిండు’ అని రిత్విక సంబుర పడింది.