వరంగల్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కాంగ్రెస్ పార్టీ జాతీయ నేతలు ములుగు, భూపాలపల్లి నియోజకవర్గాల్లో చేపట్టిన బస్సు యాత్ర పెద్ద ఫ్లాప్ షో అని, ఆ సందర్భంగా రాహుల్ చెప్పిన మాటలన్నీ పచ్చి అబద్ధాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ విమర్శించారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లపై కాంగ్రెస్ జాతీయ నేతలు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. గురువారం హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎంపీలు పసునూరి దయాకర్, మాలోతు కవిత, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డితో కలిసి మంత్రి సత్యవతి మీడియాతో మాట్లాడారు.
రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అవగాహనలేమితో రాసిచ్చిన స్క్రిప్టును రాహుల్‌గాంధీ చదివారని దుయ్యబట్టారు. విభజన చట్టంలోని గిరిజన యూనివర్సిటీ గురించి రాహుల్ గాంధీ పార్లమెంట్లో ఏనాడైనా మాట్లాడారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నేతలకు రామప్ప దేవాలయం, మేడారం సమ్మక్క సారలమ్మ జాతర, గిరిజన యూనివర్సిటీ అంశాలు అసెంబ్లీ ఎన్నికల ముందర గుర్తుకు రావడాన్ని ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో ములుగు, భూపాలపల్లి కుగ్రామాలుగా ఉండేవని, కేసీఆర్ పాలనలో జిల్లా కేంద్రాలుగా మారి ఎంతో అభివృద్ధి సాధించాయని కొనియాడారు.
అనంతరం ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ జాతీయ నేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీలు పొలిటికల్ టూరిస్టులని, రామప్ప ఆలయాన్ని చూసేందుకు వచ్చి వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని ఉద్యమ నేతగా, సీఎంగా కేసీఆర్ ఎన్నిసార్లు కోరినా కాంగ్రెస్ పట్టించుకోలేదని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ కృషితోనే రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు వచ్చందని స్పష్టం చేశారు. ములుగును జిల్లాగా మార్చి మెడికల్ కాలేజీ, వంద పడకల దవాఖాన ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని చెప్పారు.