హైదరాబాద్ : కులరహిత సమాజం కోసం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప నేత డాక్టర్ బాబూ జగ్జీవన్‌రామ్ అని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మంగళవారం జగ్జీవన్‌రామ్ 115వ జయంతి సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు నివాళి అర్పించారు. దేశ స్వాతంత్య్రం, సామాజిక సమానత్వం కోసం అలుపెరుగని పోరాటం చేసిన ఆదర్శనేత అని కొనియాడారు.
జగ్జీవన్‌రామ్ వంటి మహానీయుల ఆశయ సాధనలో భాగంగా సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు. తద్వారా సామాజిక, ఆర్థికరంగాల్లో దళితుల ఆత్మగౌరవాన్ని అత్యున్నతంగా నిలిపేందుకు జగ్జీవన్ రామ్ బాటలో చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారన్నారు. తరతరాలుగా సామాజిక, ఆర్థిక వివక్షకు గురవుతున్న దళిత సమాజ సమగ్ర అభివృద్ధికి పాటుపడుతున్నారని పేర్కొన్నారు.