రంగారెడ్డి: గతంలో చేపల కోసం ఆంధ్ర ప్రాంతంపై ఆధారపడే వాళ్లమని, ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలతో రాష్ట్రంలో మత్స్య సంపద పెరిగిందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మిషన్ కాకతీయతో చెరువుల్లో పూడికతీత పనులతో అవి జలకళ సంతరించుకున్నాయని చెప్పారు. ఉచిత చేప పిల్లల పంపిణిలో భాగంగా రంగారెడ్డి జిల్లా జలపల్లి పెద్ద చెరువులో కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి సిబితా రెడ్డి మాట్లాడుతూ.. అన్ని కులవృత్తుల వారికి పెద్దపీట వేస్తూ ఆర్థికంగా ఎదగడానికి సీఎం కేసీఆర్ ఇలాంటి పథకాలను ప్రవేశపెట్టారన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది 26,778 నీటి వనరులలో రూ.68 కోట్ల వ్యయంతో 88.53 కోట్ల చేప పిల్లలను విడుదల చేయనున్నామని పేర్కొన్నారు. సరఫరదారుడు తీసుకొచ్చిన చేప పిల్లలను నిశితంగా పరిశీలించి, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉన్నవాటినే చెరువుల్లో విడుదల చేయాలని స్పష్టం చేశారు. ముందుగా సీజనల్ చెరువుల్లో చేప పిల్లలను విడుదల చేయాలని ఆదేశించారు. మత్స్యకారుల అభివృద్ధి, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో ఈ కార్యక్రమం అమలు చేస్తున్నట్లు తెలిపారు. చెరువుల్లో నీటినిల్వలను పర్యవేక్షించేందుకు జియోట్యాగింగ్ చేస్తున్నామన్నారు.