తుంగతుర్తి, ఫిబ్రవరి 12 : కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త కార్మిక చట్టాలు, భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ రైతు సంఘాలు, కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపుమేరకు వామపక్షాల ఆధ్వర్యంలో తుంగతుర్తి మండల కేంద్రంలో గురువారం నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో వివిధ కార్మిక సంఘాలు పాల్గొని అంబేద్కర్ చౌరస్తా నుండి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు వామపక్ష నాయకులు మాట్లాడుతూ.. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకోవాలని, కార్మికుల పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను సవరణ చేస్తూ 4 లేబర్ కోడ్ లను మార్చడాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో సిపిఐ (ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కొలిశెట్టి యాదగిరి రావు, ఏఐటియుసీ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ గుగులోతు రాజారాం, సిఐటియు జిల్లా కార్యదర్శి బుర్ర శ్రీనివాస్, ఏఐటిసి జిల్లా ఉపాధ్యక్షుడు బొంకూరు శ్యాంసుందర్, ఏఐటిసి నియోజకవర్గం గౌరవ అధ్యక్షుడు కోట రామస్వామి, పాల్వాయి పున్నయ్య, బొంకురి ఎల్లయ్య, మనోజ్, అంగన్వాడీ టీచర్స్ జిల్లా అధ్యక్షురాలు ధనలక్ష్మి, సుమిత్రా దేవి, స్వరూప, వివిధ కార్మిక సంఘాల నాయకులు, అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు పాల్గొన్నారు.