ఖమ్మం, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అభివృద్ధిని జీర్ణించుకోలేకనే ప్రధాని మోదీ దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ కంటే తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉండటాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణపై మోదీ అక్కసును గమనిస్తున్న రాష్ట్ర ప్రజలు తగిన గుణపాఠం చెప్పి తీరుతారని హెచ్చరించారు. అమరుల త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంపై పార్లమెంటు సాక్షిగా మోదీ అనుచిత వ్యాఖ్యలు చేయడం తెలంగాణ ప్రజలను కించ పరచడమేనని చెప్పారు. అవకాశం లభించినప్పుడుల్లా తెలంగాణను ఆడిపోసుకోవడం, ఉద్యమ నేపథ్యాన్ని తూలనాడటం ప్రధానికి అలవాటుగా మారిందని దుయ్యబట్టారు.