హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): ఎన్నికల్లో లబ్ధి పొందాలనుకుంటే ప్రజల మనసులు గెలవాలే కానీ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడకూడదని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ హితవుపలికారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ బీజేపీ నేతలు పన్నిన కుట్రలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని పేర్కొన్నారు. ఎన్నికల్లో లబ్ధి కోసం ఇంత డ్రామాలు ఆడుతారా? అని నిలదీశారు.
బుధవారం బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రుల మానసిక క్షోభకు కారకుడైన బండి సంజయ్‌కు బాధ్యయుతమైన ఎంపీలో ఉండే నైతిక హక్కులేదని అన్నారు. తక్షణమే స్పీకర్ బండి లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీ వ్యవహారం అంతా బీజేపీ కేంద్ర పార్టీ కనుసన్నల్లోనే జరిగిందని ఆరోపించారు. దీనికి ప్రధాని మోదీ దగ్గరి నుంచి హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సహా అందరూ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ఆపేందుకు లీకులకు తెరలేపారని ఆరోపించారు. ఆఖరికి పదో తరగతి పరీక్షా పేపర్లు లీకేజీకి కుట్ర పన్నిన బండి సంజయ్‌ను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని కోరారు.
బీజేపీ క్షమాపణ చెప్పాలి: తాతా మధు
బండి సంజయ్ చేసిన దారుణ చర్యకు బాధ్యత వహిస్తూ తెలంగాణ ప్రజలకు బీజేపీ కేంద్ర నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం భేషరతుగా క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు డిమాండ్ చేశారు. ఇలాంటి నీచానికి పాల్పడిన వ్యక్తులు ఎంతటివారైనా సరే ప్రభుత్వం విడిచిపెట్టబోదని స్పష్టంచేశారు.
సంఘ విద్రోహులకన్నా దారుణం: సండ్ర
సంఘ విద్రోహుల దుశ్చర్యల కన్నా దారుణంగా బండి సంజయ్ చర్యలున్నాయని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆగ్రహం వ్య క్తం చేశారు.