మోర్తాడ్: సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో గంగాజమున తహజీబ్ సంస్కృతి వర్ధిల్లుతున్నదని ఆర్ అండ్ బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం అధ్వర్యంలో శనివారం ముస్లింలకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌లో ఆయన పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించి, ఉపవాస దీక్ష లో ఉన్న ముస్లింలకు పండ్లు తినిపించారు.
ఈ సందర్బంగా మంత్రి ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. మైనార్టీ సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.పేదింటి ఆడ బిడ్డ పెళ్లి కోసం షాదీ ముబారక్ ద్వారా రూ. లక్షా 116 ఆర్ధిక సహాయం అందిస్తున్నామని చెప్పారు. నిరుపేద మైనార్టీ పిల్లలు ఉన్నతంగా ఎదిగేందుకు మైనార్టీ గురుకులాలు ఏర్పాటుచేసినట్లు పేర్కొన్నారు. అందరూ సుభిక్షంగా ఉండాలని ఈ పవిత్ర మాసంలో ప్రార్థనలు చేయాలని ముస్లింలను మంత్రి ప్రశాంత్‌రెడ్డి కోరారు.