హైదరాబాద్ : ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బీజేపీ నాయకులు ఆరోపణలు చేయడం సరికాదని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. కవితపై నిరాధారమైన వార్తలు సృష్టించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని స్పష్టం చేశారు. కేంద్రం వద్ద ఆధారాలు ఉంటే చట్టం ప్రకారం విచారణ చేపట్టాలి. కానీ కవిత వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా వ్యవహరించొద్దని సూచించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కేసీఆర్ పోరాడుతున్నందునే కవితపై నిరాధారమైన వార్తలు సృష్టిస్తున్నారని, ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడితే తెలంగాణ ప్రజలే బీజేపీకి బుద్ధి చెబుతారని ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు.
హైదరాబాద్లోని కవిత ఇంటిపై బీజేపీ కార్యకర్తలు దాడి చేయడం సరికాదన్నారు. ఇది పిరికిపంద చర్య అని పేర్కొన్నారు. బీజేపీ కార్యకర్తల ఆగడాలను అడ్డుకొని, తరిమికొడుతామని ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు. అనవసరంగా కేసీఆర్ను కానీ, ఆయన కుటంబాన్ని కానీ నిరాధారమైన కేసుల పేరుతో వేధించాలాని చూస్తే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదు అని ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు.