Minister Prashanth Reddy | చరిత్రలో ఇంత భారీ వర్షాపాతం ఎన్నడూ చూడలేదని, కుంభవృష్టితో చాలా నష్టం జరిగిందని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఎనిమిది ప్రాంతాల్లో అత్యధిక వర్షాపాతం నమోదైందని, అందులో ఐదుప్రాంతాల్లో నిజామాబాద్వేనన్నారు. వేల్పూరు, జక్రాన్‌పల్లి, పర్కిట్, భీంగల్, కొనసముద్రంలో 25 నుంచి 45 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైందని చెప్పారు. భారీ వర్షానికి 14 పంచాయతీ రోడ్లు, 23 ఆర్అండ్బీ రోడ్లు ధ్వంసమయ్యాయన్నారు. తొమ్మిది చెరువులు, రెండు కెనాల్స్ ధ్వంసమయ్యాయన్నారు.
5వేలఎకరాల్లో పంట నష్టం జరిగిందని, చెరువుకట్టలు రోడ్ల మరమ్మతు పనులు ప్రారంభించామన్నారు. ఎలాంటి పరిస్థతులను అయిన ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్రజలు ఎవరూ భయభ్రాంతులకు గురికొవద్దన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, కలెక్టరేట్లో టోల్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామన్నారు. 24/7 అధికారులు అందుబాటులో ఉంటారని, అధికారులు ఎవరూ సెలవులు పెట్టొద్దని ఆదేశాలు జారీ చేశామన్నారు. లోతట్టు ప్రాంతాల వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించామని, వేల్పూరులో రిలీఫ్ క్యాంప్ ఏర్పాటు చేశామన్నారు. చెరువులు, వాగులు వద్దకు వెళ్లొద్దని ప్రజలకు సూచించారు.