హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ ) : కల్యాణ లక్ష్మి, షాదీము బారక్ లబ్ధిదారులకు మంత్రులు, ఎమ్మెల్యేలు చెక్కులు పంపిణీ చేస్తున్నప్పుడు ప్రజలు నిలదీస్తున్నారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన తులం బంగారం మాట సంగతేంటని అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ చెప్పిన తులం బంగారం కథ ఉత్తముచ్చటేనని తేలిపోయింది. ఈ విషయాన్ని ప్రభుత్వమే స్పష్టంచేసింది. సోమవారం శాసనమండలి ప్రశ్నోత్తరాల సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పలు ప్రశ్నలు సంధించారు. ‘రాష్ట్రంలో పేద కుటుంబాలకు చెందిన ఆడపిల్లల వివాహం కోసం కల్యాణమస్తు పథకం అమలు చేస్తున్న విషయం వాస్తవమేనా? ఈ పథకం కింద 2023 డిసెంబర్ నుంచి 2025 జనవరి వరకు లబ్ధిదారుల సంఖ్య ఎంత? వాటి వివరాలు తెలపాలని ప్రశ్నించారు. మొదటి ప్రశ్నకు ‘లేదండి’ అని మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానం ఇచ్చారు. పథకమే అమలులో లేదు కాబట్టి మిగిలిన రెండు ప్రశ్నలకు ‘ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు’ అని మంత్రి పేర్కొన్నారు.
మండలిలో మంత్రి సమాధానం తర్వాత ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ రాష్ట్రంలో 15 నెలలుగా కల్యాణమస్తు పథకం ఎందుకు అమలు కావడంలేదని, పేదింటి ఆడబిడ్డ పెండ్లికి లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామన్న మాట ఏమైందని నిలదీశారు. రాష్ట్రంలో మహిళలకు నెలకు రూ.2500 వంటి ఆర్థిక సాయం సంగతేమైందని ప్రశ్నించారు. కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం వల్ల మహిళల సంక్షేమ పథకాలు నీరుగారిపోతున్నాయని దుయ్యబట్టారు. ఆ తర్వాత శాసనమండలి ఆవరణలో కవిత మీడియాతో మాట్లాడుతూ మహిళల పట్ల సీఎం రేవంత్‌రెడ్డి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని, శనివారం అసెంబ్లీలో మహిళల పట్ల సీఎం రేవంత్‌రెడ్డి దురుసుగా మాట్లాడారని, అది చీకటిరోజుగా భావిస్తున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. తాము ఇచ్చిన హామీల మ్యానిఫెస్టో భగవద్గీత, బైబిల్, ఖురాన్‌తో సమానమని సీఎం రేవంత్‌రెడ్డి పదే పదే చెప్తున్నారని, కానీ ఆయన చెప్పిన హామీలు అబద్ధమన్న విషయం శాసనమండలి సాక్షిగా బయటపడిందని నిప్పులుచెరిగారు. కాంగ్రెస్ నేతలు ఎన్నికల ముందు ఒక మాట చెప్పి.. ఎన్నికల తర్వాత మరో మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మహిళల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధిలేదని విమర్శించారు.
రాష్ట్రంలో తెలంగాణ తొలిముఖ్యమంత్రి కేసీఆర్ ఆడపిల్లలకు అండగా నిలిచారని కల్వకుంట్ల కవిత తెలిపారు. పాప పుట్టినప్పటి నుంచి పెండ్లయ్యేంత వరకు కేసీఆర్ వెన్ను దన్నుగా నిలిచే పథకాలు ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. ప్రస్తుతం పాలిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మహిళ వ్యతిరేక సీఎంగా చరిత్రలో నిలిచిపోతారని చెప్పా రు. కవిత మీడియా సమావేశంలో ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, దేశపతి శ్రీనివాస్, నవీన్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.