Ramzan | హైదరాబాద్ : మార్చి 2వ తేదీ నుంచి ప్రారంభమయ్యే రంజాన్ మాసంలో చేయాల్సిన ఏర్పాట్లపై సచివాలయంలో ఆరవ ఫ్లోర్ కాన్ఫరెన్స్ హాల్లో మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్షా సమావేశానికి హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సమావేశంలో రంజాన్ మాసంలో తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు. రంజాన్ నెలలో నగరంలో పరిశుభ్రత విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి తెలిపారు. మసీదు, ఈద్గాల వద్ద ప్రత్యేక శానిటేషన్ బృందాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వీధి దీపాల మరమత్తులు, తాత్కాలిక లైట్లను ఏర్పాటు చేస్తామని జీహెచ్ఎంసీ కమిషనర్ తెలిపారు. రోడ్ల మరమత్తులు పూర్తి చేస్తామని వెల్లడించారు. మక్కా మసీద్, రాయల్ మాస్క్, మిరాలం ఈద్గా వద్ద ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్నామని పేర్కొన్నారు. రాత్రి సమయంలో దోమల నివారణకు జిహెచ్ఎంసి ఎంటమాలజీ టీం ద్వారా ఫాగింగ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. మసీదుల వద్ద ప్లాస్టిక్ కవర్ల పంపిణీ చేస్తున్నామన్నారు. అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ప్రత్యేక అధికారులను నియమించి సమన్వయం చేస్తున్నామని తెలిపారు.
మసీదులు, ఈద్గాల వద్ద ప్రత్యేకంగా తాగునీటి అవసరాలను కల్పిస్తున్నామని వాటర్ వర్క్స్ ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. వేసవికాలం దృష్ట్యా విద్యుత్ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో రంజాన్ నెలలో మొబైల్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ముస్లిం ఉద్యోగులకు సాయంత్రం నాలుగు గంటలకే విధులు ముగించేలా ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశామని జీఏడీ అధికారులు తెలిపారు.