Ponnam Prabhaker | మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి.. అంటూ అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఆలయం లాంటి అసెంబ్లీ సాక్షిగా అసభ్యకరంగా ప్రవర్తిస్తోంది. శాసనసభ పరువు తీసేలా వెకిలి చేష్టలకు పాల్పడింది. ప్రతిపక్ష సభ్యుల పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తూ.. సభా సంప్రదాయాలను తుంగలో తొక్కింది. రాష్ట్ర ప్రజలకు, కొత్త సభ్యులకు ఆదర్శంగా ఉండాల్సిన అధికార పక్షం సభ్యులు.. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా అసభ్యకర సైగలతో సభా మర్యాదలను మంటగలిపారు. శాసనసభలో హుందాగా వ్యవహరించాల్సిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.. సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తిస్తున్నారు.
శాసనసభలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతుండగా.. మంత్రి పొన్నం ప్రభాకర్ సభ్యతను గాలికి వదిలేశారు. ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్‌కు మంత్రి ప్రొన్నం ప్రభాకర్ బూతు సైగలు చేశారు. పొన్నం ప్రభాకర్ బూతులతో కూడిన సైగలు చేయగా రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్ పడి పడి నవ్వారు. ఇక ఆ తర్వాత సభ్యుల ప్రసంగం పొన్నం ప్రభాకర్ వినకుండా ఏదో ఒక పుస్తకం చేతపట్టుకుని చదువుతున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి.
మంత్రి పొన్నం ప్రభాకర్ బూతు సైగల పట్ల రాష్ట్ర ప్రజానీకం, మేధావులు మండిపడుతున్నారు. సభ ఒక ఆలయం లాంటిదని మరిచిరా..? అని ప్రశ్నిస్తున్నారు. నిండు సభలో అలాంటి సైగలు చేయడం ఏంటి..? ఇదేనా తెలంగాణ ప్రజలు కోరుకున్న మార్పు..? ఇదేనా మీరు ప్రజలకు ఇచ్చే సందేశం..? అని తెలంగాణ ప్రజలు, మేధావి లోకం నిలదీస్తున్నారు. సభా మర్యాదలు కాపాడాలని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే మంత్రులే.. ప్రతిపక్ష సభ్యులను ఉద్దేశించి బూతు సైగలు చేస్తారా..? ఇదేనా మీ సంస్కారం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.