హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా చెక్‌పోస్టులను రద్దు చేసిన క్రమంలో అక్రమ రవాణా అరికట్టేందుకు ఎన్ఫోర్స్మెంట్ సిబ్బందిని రంగంలోకి దించామని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బుధవారం ఖైరతాబాద్‌లోని రవాణాశాఖ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. నిర్భయ సీం కింద వెహికిల్ ట్రాకింగ్ ప్రాసెస్ కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. ఏఐ టెక్నాలజీని ఉపయోగించి రవాణాశాఖ కార్యాలయాల్లో రెగ్యులర్‌గా వచ్చే వారిని నోట్‌చేసి అలర్ట్ చేసేలా వ్యవస్థను రూపొందించామని చెప్పారు.
బ్రోకర్ (మధ్యవర్తుల) వ్యవస్థను అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. ఈవీ పాలసీ తీసుకొచ్చిన తర్వాత రూ.577 కోట్ల టాక్స్‌ను ప్రభుత్వం మినహాయించిందని, దీంతో ఈవీ వెహికిల్ అమ్మకాల షేర్ 0.03 నుంచి 1.30కి పెరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం వాహన్ అమలవుతుందని, సారథిని కూడా త్వరలోనే తీసుకొస్తామమని పొన్నం తెలిపారు. టూరిజం వెహికల్స్ డబుల్ నంబర్ ప్లేట్‌తో తిరుగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో హై సెక్యూరిటీ ప్లేట్స్ (హెచ్ఎస్ఆర్పీ) తీసుకొస్తున్నామని వెల్లడించారు. షోరూంలల్లో వాహన రిజరిస్ట్రేషన్ల అంశాన్ని పరిశీలిస్తున్నట్టు ఆయన వెల్లడించారు.