హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తేతెలంగాణ): రవాణా శాఖ 2024లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి, అన్ని రంగాల్లో విజయం సాధించినట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఈవీ పాలసీ అమలుతో ఇప్పటి వరకు 8,497 ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోళ్లు జరిగాయని తెలిపారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఏటా సగటున 5 లక్షల వాహనాలు చేరడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు పేర్కొన్నారు. రిజిస్టర్డ్ వెహికల్స్ స్క్రాపింగ్ ఫెసిలిటీస్, ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్స్ అమల్లో ఉంటాయని పేర్కొన్నారు.
ఏప్రిల్ 1 నుంచి ఇప్పటి వరకు డ్రంక్ అండ్ డ్రైవ్, రోడ్డు నిబంధనలు పాటించని వాహనదారుల 4,577 డ్రైవింగ్ లైసెన్సులను రద్దు చేసినట్టు తెలిపారు. ఉచిత బస్సు పథకంలో ఇప్పటి వరకు 125.50 కోట్ల మంది మహిళలు ప్రయాణించి రూ.4,225 కోట్ల రవాణా ఖర్చులను ఆదా చేసుకున్నట్టు వెల్లడించారు. ఏడాదిలో 1,389 కొత్త బస్సులను అందుబాటులోకి తెచ్చినట్టు మంత్రి తెలిపారు. 113 ఏఎంవీఐ ఉద్యోగాల్లో 97 మందికి, టీఎస్ఎల్పీఆర్బీ ద్వారా 63 ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్ ఉద్యోగాల్లో 54 మందికి నియామకపత్రాలు అందించినట్టు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 8,04,255 వాహనాలు టీజీలో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు తెలిపారు.
జనవరి 1 నుంచి 31వరకు రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రవాణాశాఖ, ఆర్టీసీ అధికారులతో మంగళవారం జూమ్ యాప్ ద్వారా సమావేశమయ్యారు. విద్యార్థులతో అవగాహన ర్యాలీలు, ట్రైనింగ్ క్లాస్‌లు, వర్క్‌షాపులు, సెమినార్లు నిర్వహించాలని ఆదేశించారు.