సిటీబ్యూరో, జనవరి 2 (నమస్తే తెలంగాణ ) : కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల(Six guarantees)ను తప్పనిసరిగా ఆమలు చేస్తామని రవాణాశాఖ, హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్(Minister Ponnam Prabhakar) అన్నారు. మంగళవారం మెహిదీపట్నం సర్కిల్ విజయనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ సెంటర్‌ను మంత్రి పరిశీలించారు. ఇప్పటి వరకు నగర వ్యాప్తంగా ఇప్పటి వరకు కంటోన్మెంట్‌తో పాటు 650 కేంద్రాలను ఏర్పాటు చేసి 9.92 లక్షల దరఖాస్తులు స్వీకరించామని మంత్రి వివరించారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా జీహెచ్ఎంసీ అధికారులు సమర్థవంతంగా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. పబ్లిక్ ఎక్కువ వచ్చినా ఇప్పుడున్న కౌంటర్ల కంటే అవసరం మేరకు కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటామని తెలిపారు. అర్హులైన నిరుపేదలకు పథకాలు అందుతాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ప్రజాపాలనలో భాగస్వామ్యం కావాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్‌రోస్, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, జోనల్ కమిషనర్ వెంకటేష్ దొత్రే, ప్రత్యేక అధికారి, డిప్యూటీ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు.