హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): ఇంటింటి సర్వేలో పాల్గొని వివరాలను నమోదు చేసుకునేందుకు నగరంలోని కాలనీవాసులు వెనకడుగు వేస్తున్నారని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. వివరాలు నమోదు చేసుకోని వారు ఇప్పటికైనా సర్వేలో పాల్గొనాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, స భ్యులతో మంత్రి పొన్నం సచివాలయం లో శుక్రవారం ప్రత్యేకంగా భేటీ అయ్యా రు. ఇంటింటి కుటుంబ సర్వే పరిస్థితిపై చర్చించారు.
సర్వేలో సమాచారమివ్వని కుటుంబాలు కూడా తమ వివరాలను నమోదు చేసుకునేలా కుల సంఘాలు, కమిషన్ చొరవ తీసుకోవాలని మంత్రి తెలిపారు. కులాల వారీగా సంఖ్య తేలకపోతే పథకాలు అందకపోవడమేగాక, రిజర్వేషన్ల సంఖ్య తగ్గే అవకాశముంటుందని వెల్లడించారు. సమావేశంలో కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాలలక్ష్మి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
బీసీ కమిషన్ చైర్మన్‌ను బుడబుకల, మేర, కుమ్మరి, రజక కుల సంఘాల ప్రతినిధులు కలిశారు. తమ కులం పేరును ఆరె క్షత్రియగా లేదంటే శివక్షత్రియ కులంగా మార్చాలని బుడబుకల, చిప్పోలు (మేర)గా ఉన్నదాన్ని మేర (చిప్పోలు)గా మార్చాలని, తమ కులానికి ప్రజాపతి పదాన్ని పర్యాయపదంగా చేర్చాలని మేర కులస్తులు, దోబీ పదాన్ని చేర్చాలని రజక కులస్తులు విజ్ఞప్తి చేశారు. కుల సంఘాల ప్రతినిధులు ఆవుల మహేశ్, లక్ష్మణ్ రా వు, సంగ వెంకట రాజం, రాయబారపు సంతోష్, బాలకిషన్ ప్రజాపతి, పావని రవీందర్ ప్రజాపతి, శ్రీలక్ష్మి, మల్లేశ్ కుమా ర్, చల్ల వీరేశం చైర్మన్‌ను కలిశారు.