హైదరాబాద్, జూలై 14(నమస్తేతెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి కేంద్రానికి పంపిన 42శాతం బీసీ రిజర్వేషన్ బిల్లును రాష్ట్రపతితో ఆమోదించే బాధ్యత బీజేపీదేనని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. రాష్ర్టానికి చెందిన బీజేపీ కేంద్ర మంత్రులు, ఆ పార్టీ ఎంపీలు, కీలక నేతలు చొరవ తీసుకోవాలని హితవు పలికారు. రాష్ట్రపతితో బిల్లు ఆమోదింపచేసి రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చించాలని కేంద్ర మంత్రులకు సూచించారు. ఈ విషయంలో కేంద్ర మంత్రులు చొరవ తీసుకుంటే రాష్ట్ర మంత్రివర్గం, అఖిలపక్షంతో కలిసి ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. బీసీ రిజర్వేషన్ల బిల్లు అమలుపై చిత్తశుద్ధి లేకే వారు స్పందించడం లేదని, అలాంటి వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఎందుకు అడ్డంకులు సృష్టిస్తున్నారని ప్రశ్నించారు.
హైదరాబాద్ గాంధీభవన్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీకి తెలంగాణ బీసీలపై ప్రేమే లేదని, అందుకే గత ఎన్నికల ముందు బీసీ నేతను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించి అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తికి అప్పగించిందని విమర్శించారు. ఆ పార్టీ జాతీయ ఓబీసీ అధ్యక్షుడైన ఎంపీ లక్ష్మణ్ బీసీ రిజర్వేషన్ల విషయం లో అసహనం వ్యక్తం చేస్తున్నారని ఆరోపించారు. గత ఎన్నికల్లో హామీ మేరకు 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లు అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తేనున్నదని, దానిని సీనియర్ బీసీ నేత లక్ష్మణ్ తమ పార్టీ కోణంలో విమర్శించడం దారుణమని పేర్కొన్నారు.
2018 పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారమే ఆర్డినెన్స్
2018 పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారమే బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 42శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై ఆర్డినెన్స్ తీసుకొచ్చే వెసులుబాటు ప్రభుత్వానికి ఉన్నదని, దానికి శాసనసభకే సంబంధం లేదని తెలిపారు. బీసీ బిల్లును కేంద్రం ఎందుకు ఆమోదించడం లేదని, అసలు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను బీజేపీ నేతలు వ్యతిరేకిస్తున్నారా? అని ప్రశ్నించారు. తెలంగాణలో సామెతలు ఉండొచ్చు కానీ వాటిని మహిళలపై ప్రయోగించడం తప్పు అని పేర్కొన్నారు. మహిళలపై కాంగ్రెస్ పార్టీకి అపారమైన గౌరవం ఉన్నదని, ఎమ్మెల్సీ కవితపై తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు తప్పు అని, అదే సమయంలో క్యూ న్యూస్ కార్యాలయంపై తెలంగాణ జాగృతి దాడులు చేయడం కూడా సమర్థనీయం కాదని పొన్నం అభిప్రాయపడ్డారు.