హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఖానాపూర్ చెరువు సమీపంలో గుడిసెలు వేసుకుని నివాసముంటున్న వారి ఇంటి స్థలం కొలతలు తీసుకుంటున్న అధికారులను గత శుక్రవారం కాలనీవాసులు అడ్డుకున్నారు. తాము ఎన్నో ఏండ్లుగా ఇక్కడ గుడిసెలు వేసుకుని, భవనాలు కట్టుకుని జీవిస్తున్నామని అధికారులకు మొరపెట్టుకున్నారు. అయినా అధికారులు వినలేదు. హైడ్రా పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం తాము కట్టుకున్న ఇండ్లను కూల్చేస్తుందేమోనని వారు భయంతో ఆందోళనకు గురయ్యారు. ఆ ఆవేదనలో కొందరు కాలనీవాసులు సీఎం రేవంత్‌ను దుర్భాషలాడారు. దీంతో వృద్ధుడు గంగన్నతోపాటు మరికొందరిపై 65(2),5,6, బీఎన్ఎస్ పోక్సో కింద కేసులు నమోదు చేసినట్టు ఆదిలాబాద్ వన్ టౌన్ ఎస్సై ఇసాక్ తెలిపారు.
కేసులు నమోదు చేయండి : మంత్రి పొన్నం
హైడ్రా బాధితుల వీడియోలు, వారి భావోద్వేగాలు, కన్నీటి కథనాలు సోషల్ మీడియాలో ప్రచారం చేసినా, ఆ వీడియోలో పోస్టు చేసినా వెంటనే కేసులు పెడతామని మంత్రి పొన్నం ప్రభాకర్ గత గురువారం హెచ్చరించారు. వ్యక్తిగత దూషణలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను తిట్టకుండా కోర్టులకు వెళ్లాలని, వచ్చే ఎన్నికల్లో బ్యాలెట్ ద్వారా మీ ఆగ్రహం చూపెట్టాలని ఆ వీడియోలో సలహా ఇచ్చారు.
కాంగ్రెస్ మళ్ల గెలిస్తే గుండు కొట్టించుకుంట
కేసీఆర్ పదేండ్ల పాలనలో పేదలు బంగారంలా బతికిండ్రు. గరీబోళ్లకు ఆపదలో ఆదుకుని అన్నం పెట్టి అండగా ఉన్నాడు. కాంగ్రెస్ ఇచ్చిన ఒక్క హామీ అమలు కాకపోగా మా ఇండ్లను కూలగొట్టి పేదల బతుకులు ఆగం చేయడానికి సీఎం రేవంత్‌రెడ్డి కుట్రలు చేస్తున్నడు. పేదల ఇండ్లు కూలగొట్టి మా బతుకులు ఆగం చేస్తున్న కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి రాదు. వస్తే నేను గుండుకొట్టించుకుని ఊరంతా తిరుగుత.
-బొడిగం గంగన్న, ఖానాపూర్, ఆదిలాబాద్
ప్రభుత్వ వాదన విన్నాకే ఉత్తర్వులు
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం అలియాపూర్ గ్రామంలోని 119/21, 22 సర్వే నంబర్లలో ఉన్న నిర్మాణాలను హైడ్రా కూలగొట్టడంపై డీ లక్ష్మి అనే మహిళ ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ కే లక్ష్మణ్ మంగళవారం వి చారణ చేపట్టారు. హైడ్రా ఏర్పాటుపై ప్రభుత్వ వాదన వినకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని చెప్పారు. హైడ్రాకు ఉన్న చట్టబద్ధత ఏమిటో తెలియజేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణను ఈ నెల 15కు వాయిదా వేశారు.