హైదరాబాద్, అక్టోబర్7 (నమస్తే తెలంగాణ): వచ్చే విద్యా సంవత్సరం నుంచి మోడల్ స్కూళ్ల తరహాలో బీసీ గురుకులాల్లో కూడా పదోతరగతి తరువాత నేరుగా ఇంటర్ ప్రవేశాలు కల్పిస్తామని, విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేస్తామని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. బీసీ గురుకులాల్లో ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉండేలా సమాలోచనలు చేస్తున్నామని వివరించారు. బీసీ సంక్షేమశాఖలోని అన్నివిభాగాల ఉన్నతాధికారులతో విస్తృత స్థాయి సమావేశాన్ని బంజారాహిల్స్‌లోని కొమురంభీమ్ భవన్లో సోమవారం నిర్వహించారు. బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశంతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. బీసీ గురుకులంలో ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ, సౌట్స్ అండ్ గైడ్స్ ఉండేలా, ఎంసెట్, నీట్ కోచింగ్ ఇచ్చేలా చర్యలు చేపడతామని వెల్లడించారు.
హాస్టల్ వార్డెన్ల ప్రమోషన్లపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. గురుకులాల కోసం ఎమ్మెల్యే, ఎంపీ ఆ జిల్లా మంత్రి, ఎమ్మెల్సీలు వారి నిధుల నుంచి కేటాయించేలా కలెక్టర్ దృష్టికి తీసుకుపోవాలని సూచించారు. ఈనెల 15-31లోపు ప్రతి గురుకులంలో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఏర్పాటు చేయాలని, వారి సలహాలు, సూచనలు తీసుకొని ఫీడ్ బ్యాక్ అందించాలని పేర్కొన్నారు. విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడానికి ప్రతి గురుకులలో బాక్స్ ఏర్పాటు చేసి ఆర్సీవోలు పరిశీలించాలని సూచించారు. సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాల మాయాదేవి, గురుకుల సెక్రటరీ సైదులు, ఎంబీసీ కార్పొరేషన్ ఎండీ అలోక్ కుమార్, బీసీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్యభట్టు, అడిషనల్ డెరైక్టర్ చంద్రశేఖర్, జేడీ సంధ్య, నాయీబ్రాహ్మణ ఎండీ ఇందిర, బీసీ స్టడీ సరిల్ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, డీబీసీడీవోలు, ఏడీబీసీడీవోలు, ఆర్సీవోలు, డీసీవోలు, ప్రిన్సిపాల్స్, హాస్టల్ వార్డెన్లు తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్, అక్టోబర్7(నమస్తే తెలంగాణ): బీసీ సంక్షేమశాఖ బీసీ విద్యార్థులకు అమలు కోసం ఫీజు రీయింబర్స్మెంట్, వివిధ స్కాలర్‌షిప్‌ల కోసం రూ.1502.83కోట్ల నిధులను విడుదల చేసింది. సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ స్కాలర్‌షిప్‌ల కోసం ప్రభుత్వం మొత్తంగా రూ.1890.34కోట్లను బడ్జెట్లో కేటాయించింది. ఇప్పటికే 387.51కోట్లను విడుదల చేయగా, మిగిలిన రూ.1502.83కోట్ల నిధులను తాజాగా విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.