బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలని మా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నది. దీనిపై గతంలో క్యాబినెట్ తెచ్చిన ఆర్డినెన్స్ పెండింగ్‌లో ఉన్నది. సెప్టెంబర్ 30లోపు స్థానిక ఎన్నికలు ముగించాలని హైకోర్టు గడువు విధించింది. ఈ దశలో కేసీఆర్ 2018లో తెచ్చిన పంచాయతీరాజ్చట్టం ఉరితాడుగా మారింది. న్యాయ కోవిదులు, నిపుణులతో చర్చించి 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్ 285(ఏ) సవరణకు నిర్ణయించాం. 50శాతం సీలింగ్‌ను ఎత్తివేయడానికి బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెడతాం.
-ఇవీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం శనివారం మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు
హైదరాబాద్, ఆగస్టు 30(నమస్తే తెలంగాణ): రిజర్వేషన్లు 50% మించకుండా 2018లో కేసీఆర్ తెచ్చిన చట్టమే ఉరితాడుగా మారిందన్నది మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రేలాపనలు. కాంగ్రెస్ సర్కారు మొత్తానిదీ ఇదే పాట. ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించడంలో విఫలమైన కాంగ్రెస్ సర్కారు.. ఆ నెపాన్ని కేసీఆర్‌పై నెట్టేందుకు ఒక పద్ధతి ప్రకారం కుట్ర చేస్తున్నది. మంత్రి పొన్నం, కాంగ్రెస్ సర్కారు పెద్దలు వాదిస్తున్నట్టుగా రాష్ట్రంలో రిజర్వేషన్లు 50% మించకుండా కేసీఆరే చేశారనుకుంటే..
ఇతర రాష్ర్టాల్లో రిజర్వేషన్లు 50శాతానికి మించి అమలు కావాలి కదా? అక్కడ కేసీఆర్ లేరు కదా? అయినా అక్కడ ఎందుకు అమలు కావడం లేదు? దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి సమాధానం రాదు.. ఉండదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ రాష్ట్రంలోనూ రిజర్వేషన్లు 50శాతానికి మించి అమలు కావడం లేదు. కానీ తెలంగాణ సర్కారు మాత్రం కొత్త వాదనను తెరపైకి తెచ్చింది. విద్యా, ఉద్యోగాల్లో కాకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను ఎంత వరకైనా పెంచుకునే అవకాశం ఉన్నదని మంత్రి పొన్నం ప్రభాకర్ సెలవిచ్చారు.
దేశంలో ఏ రాష్ట్రంలోనూ రిజర్వేషన్లు 50 శాతానికి మించొద్దనే అంశంపై సుప్రీంకోర్టు తీర్పు స్పష్టంగా ఉన్నది. ఇందుకు అనుగుణంగా ఒక్క తమిళనాడు మినహా దేశంలో మరే రాష్ట్రంలోనూ రిజర్వేషన్లు 50 శాతానికి మించి అమలు కావడం లేదు. తమిళనాడులో తొమ్మిదో షెడ్యూల్లో ఉండటం వల్ల.. నాటి ప్రభుత్వం పట్టుబట్టి పార్లమెంట్లో చట్ట సవరణ చేయించి దాన్ని సాధించుకున్నది. దానిప్రకారం తమిళనాడులో మొత్తం రిజర్వేషన్లు 69% అమలవుతుండగా ఇందులో బీసీలకు 50% అమలవుతున్నాయి. ఇందులో బీసీలకు 26.5%, బీసీ-ముస్లింలకు 3.5%, ఎంబీసీలకు 20% చొప్పున రిజర్వేషన్లుగా విభజించి అమలు చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా ఒకటి మినహా అన్ని రాష్ర్టాల్లో 50% లోపే ఓబీసీ రిజర్వేషన్లు ఉంటే.. తెలంగాణ కాంగ్రెస్ సర్కారు మాత్రం ఒక్క తెలంగాణలోనే బీసీలకు రిజర్వేషన్లు పెంచకుండా కేసీఆర్ అడ్డుకుంటున్నట్టుగా విషప్రచారం చేస్తున్నది. వాస్తవాలను కప్పిపుచ్చుతూ బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేస్తామని చెప్తున్నది. అయితే బీసీ రిజర్వేషన్ల పెంపునకు న్యాయపరమైన, రాజ్యాంగపరమైన చిక్కులు తప్పవనే అంశం కాంగ్రెస్ సర్కారు పెద్దలకు ముందే తెలుసనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయినా బీసీలను మోసం చేసేలా హామీ ఇచ్చి.. ఇప్పుడు హడావుడి చేస్తున్నది. బిల్లులు, ఆర్డినెన్స్‌ల పేరుతో బీసీలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో బీసీలకు 23% రిజర్వేషన్లు అమలవుతుండగా కాంగ్రెస్ సర్కారు వీటిని 42% పెంచుతామని హామీ ఇచ్చింది. రిజర్వేషన్ల పెంపు అంశం సర్కారు ఇచ్చే జీవోలతో అమలు కాదని రాజ్యాంగ, న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఇందుకోసం ఏకంగా పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ జరగాలని, సుప్రీంకోర్టు తీర్పులు సైతం సవరించాల్సి ఉంటుందని చెప్తున్నారు. దీంతో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలంటే రాజ్యాంగబద్ధత కల్పించాలి.
ఇటీవలి పరిణామాలతో రిజర్వేషన్లు 50% మించి అమలు చేయడం, ఇందులో భాగంగానే బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు సాధ్యం కాదనే విషయం సర్కారు పెద్దలకు అవగతమైందని తెలిసింది. ఈ నేపథ్యంలో ఇచ్చిన మాట ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయనిపక్షంలో కాంగ్రెస్‌పై బీసీల్లో వ్యతిరేకత వ్యక్తమవడంతోపాటు బీసీలు పార్టీకి వ్యతిరేకమవుతారనే ఆందోళన ప్రభుత్వ పెద్దలను పట్టి పీడిస్తున్నది. దీంతో దీని నుంచి తప్పించుకునేందు బీఆర్ఎస్ను, కేసీఆర్‌ను దోషులుగా నిలబెట్టే కుట్రలు చేస్తున్నదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అందుకే గత విషయాలను ఇప్పుడు ప్రస్తావిస్తూ కుట్రలు చేస్తున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి.