హైదరాబాద్, జనవరి 1 (నమస్తేతెలంగాణ) : ప్రయాణికులకు రోడ్డు-భద్రతపై అవగాహన కల్పించాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు సూచించారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా బుధవారం హైదరాబాద్‌లోని జూబ్లీ బస్టాండ్(జేబీఎస్)ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. బస్‌స్టేషన్‌లోని టాయిలెట్స్, కార్గో సెంటర్‌ను, క్యాంటీన్లో ఆహార పదార్థాలు పరిశీలించారు.
దుకాణాల్లో నాణ్యమైన వస్తువులను విక్రయించాలని, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, ఎమ్మార్పీ కంటే అధిక రేట్లకు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. తాగునీటి సౌకర్యాలను, ప్లాట్ ఫాంలను పరిశీలించారు. ఆర్టీసీ డ్రైవర్లతో మాట్లాడారు. మంత్రి పొన్నం ప్రభాకర్ వెంట కలెక్టర్ అనుదీప్ దురశెట్టి, ఆర్టీసీ అధికారులు ఉన్నారు.
విశ్వకర్మ యోజన పథకం లబ్ధిదారులను గుర్తించాలని, పథకంపై కులవృత్తిదారులకు అవగాహన కల్పించాలని లేదంటే.. ఒక ఇంక్రిమెంట్ కట్ చేస్తామని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను హెచ్చరించారు. గురుకుల విద్యార్థులకు మౌలిక వసతుల్లో, నాణ్యమైన భోజనం అందించే విషయంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని పేర్కొన్నారు. బీసీ సంక్షేమశాఖ కార్యదర్శి శ్రీధర్, కమిషనర్ బాల మాయాదేవి, మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి సైదులు, ఉన్నతాధికారులు, ఆర్సీవోలు, ప్రిన్సిపాళ్లు, అధికారులతో బుధవారం జూమ్ మీటింగ్ నిర్వహించారు.