హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రానికి కొత్తగా మూడు సైనిక్ స్కూళ్లను మంజూరు చేయాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. స్కూళ్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సంపూర్ణంగా సహకరిస్తామని పేర్కొన్నారు. మంగళవారం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి లేఖ రాశారు. కొత్త సైనిక్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని, తెలంగాణ విద్యార్థులకు ఏపీలోని సైనిక్ స్కూల్స్‌లో స్థానికత కోటాను పునరుద్ధరించాలని కోరుతూ పలువురు తల్లిదండ్రులు మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
క్రాంతి కీన్ ఫౌండేషన్ ప్రతినిధులు పీఎస్ఆర్ క్రాంతి, సంతోష్, జాకబ్, లావణ్య, కళ్యాణి తదితరులు పొన్నంను కలిసి తెలంగాణ విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు. స్పందించిన పొన్నం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి లేఖ రాశారు. ఆ తర్వాత తల్లిదండ్రులు విద్యాకమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, కమిషన్ సభ్యుడు ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్రావును సైతం కలిసి వినతిపత్రాలు అందజేశారు.