హైదరాబాద్, ఆగస్టు 30(నమస్తే తెలంగాణ): బీసీ సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు శాసనసభ ఆవరణలో అవమానం ఎదురైంది. మంత్రివర్గ సమావేశంలో పాల్గొనడం కోసం పొన్నం ప్రభాకర్ అక్కడికి వెళ్లారు. కమిటీ హాలుకు వెళ్లేందుకు ఆవరణలో రెండు లిఫ్టులున్నాయి. ఒక లిఫ్టును సీఎం వస్తున్నారని భద్రతా సిబ్బంది ఆపి ఉంచారు. మరోలిఫ్టు పైన ఫ్లోర్లో ఉంది. సీఎం వచ్చేందుకు సమయం పడుతుంది కాబట్టి, సిద్ధంగా ఉన్న లిఫ్టులో వెళ్తానని పొన్నం కోరగా భద్రతా అధికారులు ఒప్పుకోలేదు. దీంతో మంత్రి పొన్నం ప్రభాకర్.. రెండో లిఫ్టు వచ్చేంత వరకు వేచిచూసి.. కమిటీ హాలుకు వెళ్లిపోయారు. అదే సమయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వచ్చి.. సీఎం కోసం ఉంచామని సెక్యూరిటీ సిబ్బంది చెప్పిన మొదటి లిఫ్టులోనే.. కమిటీ హాలుకు చేరుకున్నారు.
ఇద్దరు మంత్రులు దాదాపు ఒకేసారి కమిటీ హాలు వద్దకు వెళ్లారు. పొంగులేటిని చూసిన పొన్నం ప్రభాకర్… ఎలా వచ్చారని అడిగారు. లిఫ్టులోనే వచ్చానని పొంగులేటి సమాధానం ఇచ్చారు. దీంతో పొన్నం ప్రభాకర్.. లిఫ్టులో మళ్లీ కిందకు వెళ్లి… అక్కడున్న సెక్యూరిటీ సిబ్బందిని మందలించారు. పొంగులేటి, తాను ఇద్దరూ మంత్రులమేనని, తాను వెళ్తానంటే అనుమతి ఇవ్వకుండా, పొంగులేటిని మాత్రం అదే లిఫ్టులో ఎలా పంపించారని తీవ్రఆగ్రహం వ్యక్తంచేశారు. సమానహోదాలో ఉన్నా.. ఇదేం వివక్ష అంటూ నిలదీశారు. అక్కడే ఉన్న పలువురు మీడియా ప్రతినిధులు, ఇతరులు కలగజేసుకుని, బీసీలకు ఒక రూలు, రెడ్డీలకు మరో రూలా అంటూ ఆశ్చర్యం వ్యక్తంచేశారు.