హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. లోకేశ్ బనకచర్ల గురించి మాట్లాడటం మాని తొలుత నికర జలాలు, మిగులు జలాలు, వరద జలాల గురించి తెలుసుకోవాలని సూచించారు. బనకచర్ల కోసం వరద జలాలు వాడుకుంటామన్న లోకేశ్ వ్యాఖ్యలు తెలుగు రాష్ర్టాల మధ్య ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని మండిపడ్డారు.
ఆదివారం హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడిన పొన్నం.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నాడు నీటి లభ్యత ఆధారంగా తెలంగాణకు 968 టీఎంసీలు, ఏపీకి 531 టీఎంసీలు కేటాయించారని, ఆ నికర జలాల మీద మిగులు జలాలు తీసుకున్న తర్వాత వరద జలాలు గురించి ఆలోచించాలని సూచించారు.
ప్రాజెక్టుల నీటి వినియోగం పూర్తయిన తర్వాత వరద జలాలు లెక్కలోకి వస్తాయని పేర్కొన్నారు. అది తెలియకుండా ప్రజలను మభ్యపెట్టి ఏపీ ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణకు రావాల్సిన నీటిని ఒక్క చుక్క కూడా వదులుకోబోమని స్పష్టం చేశారు.