హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తేతెలంగాణ): ‘సర్పంచ్ల బకాయిలకు సర్కారు గ్యారెంటీ అని.. వచ్చే ఏడాది మార్చి 31లోగా విడతల వారీగా పెండింగ్ బిల్లులన్నీ క్లియర్ చేస్తాం’ అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. సోమవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదు.. సర్పంచులు అర్థం చేసుకోండి..’అంటూ విజ్ఞప్తి చేశారు. సర్పంచుల బాధలు తమకు తెలుసని, ప్రతిపక్షాల ఉచ్చులోపడి ప్రభుత్వాన్ని బద్నాం చేయవద్దని కోరారు.
కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ పదేండ్లలో తెలంగాణకు చేసిందేంటో చెప్పాలని ప్రశ్నించారు. దమ్ముంటే అమరువీరుల స్థూపం వద్దకు చర్చకు రావాలని సవాల్ విసిరారు. బీజేపీ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను విస్మరిస్తున్నా పట్టించుకోని కిషన్‌రెడ్డికి కాంగ్రెస్ హామీల గురించి మాట్లాడే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. రూ. 10 వేల కోట్ల వరద నష్టం జరిగిందని కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ చౌహాన్‌కు నివేదిస్తే కేవలం రూ. 400 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంటే కిషన్‌రెడ్డి పట్టించుకోలెదెందుకని నిలదీశారు. కిషన్‌రెడ్డిది తెలంగాణ డీఎన్ఏ కాదని, అందుకే న్యాయం చేయలేదని దెప్పిపొడిచారు.