హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ): ఎట్టకేలకు మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ (Ponnam Prabhakar) తన సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు (Adluri Laxman) క్షమాపణలు చెప్పారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ బుధవారం ఉదయం ఇద్దరు నేతలను తన ఇంటికి పిలిచి రాజీ చేశారు. ఇందులో భాగం మంత్రి పొన్నం ప్రభాకర్ సహచర మంత్రి లక్ష్మణ్‌కు వ్యక్తిగతంగా క్షమాపణ చెప్తున్నట్టు ప్రకటించారు. అయితే లక్ష్మణ్ మీద బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేసినట్టు ఆయన ఒప్పుకోకపోవటం, తాను అనని మాటలు తనకు ఆపాదించారని పేర్కొనటంపై మాదిగ దండోర నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పశ్చాత్తాపంలేని క్షమాపణ వ్యర్థం అని, మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి అడ్లూర్ లక్ష్మణ్‌కు జరుగుతున్న అవమానాలు ఇది తొలిసారి కాదని మండిపడుతున్నారు.
వివేక్ తండ్రి కాకా వెంకటస్వామి 96వ జయంతి రోజునే అడ్లూరిని తీవ్రంగా అవమానించారని, దానికి కొనసాగింపే జూబ్లీహిల్స్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ అవమానకర వ్యాఖ్యలు అని మాదిగ సామాజికవర్గం నేతలు మండిపడుతున్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్‌లు ఉద్దేశపూర్వకంగానే మైనార్టీ మంత్రిగా ఉన్న అడ్లూరి లక్ష్మణ్ శాఖలో వేలు పెట్టారని, బాడీషేమింగ్‌కు పాల్పడ్డారని వారు ఆరోపించారు. ఆరు నిమిషాల నిడివి ఉన్న వీడియోలో దళిత మంత్రిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసినట్టు స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ మంత్రి పొన్నం తాను ఆ మాటలు అనలేదని, బీఆర్ఎస్ నేతలు తన మాటలను వక్రీకరించారని చెప్పటం మాదిగ జాతి పట్ల ఆయనకున్న అహంకార ధోరణికి నిదర్శనమని మండిపడ్డారు.
ఇది కేవలం ఓ వ్యక్తిని అవమానించడం కాదని, దళిత సమాజానికి జరిగిన అవమానం అని వారు ఆవేదన వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఒత్తిడితో పొన్నం ప్రభాకర్, వివేక్ వెంటస్వామిలను తమ నేత అడ్లూరి లక్ష్మణ్ క్షమించినా.. దళిత జాతి బిడ్డలు వారిని క్షమించరని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే వరకు ఊరుకునేది లేదని మాదిగ సామాజికవర్గం నేతలు స్పష్టం చేశారు.
మొదటినుంచే కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలను రాజకీయంగా అణదొక్కుతున్నదని, ఈ 20 నెలల కాలంలో అనేక అవమానాలకు గురిచేసిందని మాదిగ దండోర నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. దళిత జాతిలోనే మరో వర్గం నేతలు తమ జాతి పట్ల చిన్నచూపుతో ఉన్నారని, వారి అహంకార ధోరణికి అనేక ఉదాహరణలు ఉన్నాయని మంద కృష్ణ మాదిగ ఆరోపించారు. దళిత సామాజికవర్గానికి చెందిన సహచర మంత్రిని దూషిస్తుంటే.. ఇంకో దళిత మంత్రి కనీసం వారించకపోవడమేంటని వివేక్ తీరును వారు తప్పు పడుతున్నారు. వివేక్ ఈ వ్యాఖ్యలను ఖండించకపోగా, సమర్థించినట్టు హావభావాలు ప్రదర్శించడం వీడియో క్లిప్పింగ్‌లో స్పష్టంగా కనిపిస్తున్నదనిని మాదిగ దండోర నేతలు అంటున్నారు. ఇటీవల ఒక కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వచ్చి కుర్చీలో కూర్చోగానే.. మంత్రి వివేక్ లేచి వెళ్లిపోయారని, మాదిగ జాతి నేత పకన కూర్చోవడాన్నే ఆయన ఓర్చుకోలేకపోతున్నారని దండోరా నేతలు ఆరోపించారు. ఈ నెల 5న జరిగిన వివేక్ తండ్రి కాకా వెంకటస్వామి 96వ జయంతి ఉత్సవాల సందర్భంగా అడ్లూరి లక్ష్మణ్‌కు తీవ్ర అవమానం జరిగిందని, ఈ కార్యక్రమానికి లక్ష్మణ్‌ను మినహా ప్రభుత్వంలోని కాంగ్రెస్ పెద్దలను, మాల సామాజిక వర్గం నేతలను అందరినీ ఆహ్వానించారని వారు ఆవేదన వ్యక్తంచేశారు. ఇది కాకతాళీయంగా జరగలేదని వారు మండిపడుతున్నారు.
అడ్లూరి లక్ష్మణ్‌కు చెందిన ఉన్న మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమానికి అరగంట ముందుగా వెళ్లి మంత్రి రాలేదని ప్రచారం చేయటం అన్యాయమని, ఆ శాఖలో పొన్నం ప్రభాకర్, వివేక్‌లు జోక్యం చేసుకవటంలోనే కుట్ర దాగి ఉందని వారు ఆరోపించారు. ‘మీ శాఖల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేదా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి జోక్యం చేసుకుంటే ఊరుకుంటారా?’ అని మందకృష్ట మాదిగ ప్రశ్నించారు. అసలు వారిని రమ్మన్నదెవరు, వెళ్లమన్నది ఎవరని మరో నేత గోవింద్ నరేశ్ మాదిగ నిలదీశారు. ఆకలినైనా భరిస్తాం కానీ అవమానాలు సహించమని ఆయన హెచ్చరించారు.
కరీంనగర్ నెట్వర్క్, అక్టోబర్ 8: మాదిగ జాతికి చెందిన ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌పై మరో మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఎమ్మార్పీఎస్, దళిత సంఘాల నాయకులు భగ్గుమన్నారు. బుధవారం కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కరీంనగర్, జమ్మికుంట, పెద్దపల్లిలో ఆందోళనకు దిగారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ను అవమానించేలా మాట్లాడటం సరికాదని అన్నారు. ముమ్మాటికీ మాదిగజాతిపై అక్కసుతో, ఆత్మగౌరవం దెబ్బతీయాలనే దురుద్దేశంతో ఇలాంటి వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. మరో మంత్రిని నోటికి వచ్చినట్టు దూషించిన పొన్నం ప్రభాకర్‌ను మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.