హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఆర్టీసీలో కార్మిక సంఘాల పునరుద్ధరణ, సమ్మె హామీలపై రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు శుక్రవారం సమావేశమయ్యారు. ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ‘ఆర్టీసీలో కార్మిక సంఘాలకు చెక్?’ అనే శీర్షికన కథనం ప్రచురితమవగా.. దానికి అటు ప్రభుత్వం నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్, ఇటు కార్మిక సంఘాల నేతలు స్పందించారు.
శుక్రవారం జరిగిన సమావేశం ప్రాధాన్యం సంతరించుకున్నది. వీరి చర్చల సారాంశాన్ని ప్రభుత్వ పెద్దలు, కార్మిక సంఘాల నేతలెవరూ అధికారికంగా వెల్లడించనప్పటికీ.. మంత్రిని కలిసిన కార్మిక సంఘాల నేతల వినతికి పొన్నం సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. ఆర్టీసీ కార్మికుల సమస్యలన్నీ తమ పరిశీలనలో ఉన్నాయని, వాటిపై ముఖ్యమంత్రితో మాట్లాడి చర్చిస్తానని హామీ ఇచ్చినట్టు సమాచారం. ఆర్టీసీలో యూనియన్లను రద్దు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదనే సంకేతం మంత్రి ద్వారా వచ్చినట్టు తెలిసింది. జూన్ 2న ప్రభుత్వ ఉద్యోగులతోపాటు.. ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త అందుతుందని ఆశిస్తున్నారు.