Minister Ponguleti | హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇండ్లు, కార్యాలయాల్లో రెండురోజులపాటు సోదాలు నిర్వహించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు ఇంతవరకు దానిపై ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఏం జరిగింది? ఎంత నగదు దొరికింది? ఏవేం డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు? క్రిప్టో ఖాతాల వివరాలు ఏంటి? అనే విషయాలు సోమవారం కూడా వెల్లడి కాలేదు. రెండ్రోజుల సోదాల్లో కొన్ని కోట్ల రూపాయల నగదు దొరికిందని, ఇతర అక్రమ లావాదేవీల వివరాలు తెలిశాయని పలువురు అంటున్నా.. ఈడీ అధికారులు మాత్రం వాటిపై స్పష్టతనివ్వకపోవడం సర్వత్రా ఆసక్తిగా మారింది. సోదాలపై అధికారిక ప్రకటన లేకపోవడంతో ఏమైనా రాజకీయ కోణం ఉందా? అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి.
గతంలో తన ఇండ్లు, ఆఫీసుల్లో ఎప్పు డు కేంద్ర దర్యాప్తు సంస్థల సోదాలు జరిగినా.. అదే రోజు ఏం జరిగిందో? ఎందుకు సోదాలు చేశారో? పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మీడియాకు వెల్లడించేవారు. తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అతని ఇండ్లు, ఆఫీసుల్లో జరిగిన మొదటి సోదాలు కావడం, భారీగా డబ్బులు దొరికాయనే వార్తలు వెలువడటం, ఈడీ నుంచి అధికారిక ప్రకటన ఏమీ లేకపోవడంతో ఆయన కూడా మీడియా సమావేశం పెట్టేందుకు వెనక్కి తగ్గారని చర్చించుకుంటున్నారు. ‘ఏం జరిగింది అన్నా’ అని కొంద రు అంటే.. ‘ఏం జరుగుతుందో చూడాలి అన్నా’ అంటూ దాటవేస్తున్నారని సన్నిహితులు చెప్తున్నారు. ఇంకా వివరాలు వెల్లడికాకపోవడం పట్ల.. ‘రాత్రికి రాత్రే ఎవరు చక్రం తిప్పారు’ అంటూ మరికొందరు మాట్లాడుకుంటున్నారు.
తెలంగాణలో శుక్ర, శనివారాల్లో ఢిల్లీ ఈడీ అధికారులు జరిపిన సోదాల్లో మూడు కౌంటింగ్ మెషీన్లతో లెక్కపెట్టేంత డబ్బు దొరికినా కూడా.. లెక్క బయటికి రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. జూబ్లీహిల్స్, హిమాయత్సాగర్లలో ఈడీ సోదాలు జరిగాయి. సోదాల మధ్యలో అధికారులు బయటికి వెళ్తూ.. డబ్బులు లెక్కపెట్టే కౌంటింగ్ మెషీన్లు తెస్తూ.. నానా హంగామా చేశారు. సోదాలు చేపట్టి ఐదు రోజులు అయినా కూడా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. మరోవైపు బంజారాహిల్స్‌లోని ఓ కార్యాలయంలో ‘సీపీయూలు, హార్డ్‌డిస్క్‌లు, ఇతర కీలక పత్రాల తరలింపు’పై సైతం ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిసింది. దీంతో అసలేం జరుగుతోంది? అనే అనుమానాలు, ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.