హైదరాబాద్, ఆగస్లు25 (నమస్తే తెలంగాణ): రిజిస్ట్రేషన్ శాఖలో త్రిముఖ వ్యూహాన్ని రూపొందించాలని రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగులతో ఎంసీఆర్హెచ్ఆర్డీలో ఆదివారం ప్రత్యేక ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాబోయే రెండేండ్లలో ప్రభుత్వ భవనాల్లో రిజిస్ట్రేషన్ కార్యాలయాలు సేవలు అందిస్తాయని తెలిపారు.
ఇతర రాష్ట్రాల్లోని రిజిస్ట్రేషన్ శాఖల్లో ఉన్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేయాలని చెప్పారు. నూతన టెక్నాలజీని వినియోగించాలని తెలిపారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ఎలాంటి ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని ఉద్యోగులకు సూచించారు. నిజాయితీ, అంకితభావంతో పనిచేయాలని సూచించారు. అద్దెలు, తదివర వసతులకు అవసరమైన బడ్జెట్‌ను త్వరలోనే మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
ప్రభుత్వ కార్యదర్శి, స్టాంపులు రిజిస్ట్రేషన్ల కమిషనర్ బుద్ధప్రకాశ్ జ్యోతి మాట్లాడుతూ 2014లో రూ.2,746 కోట్లుగా ఉన్న రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం నిరుడికి 14,588 కోట్లకు చేరుకున్నదని వివరించారు. అనంతరం రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ వార్షిక నివేదికను మంత్రి విడుదల చేశారు. సమావేశంలో అదనపు ఐజీలు, డీఐజీలు, జిల్లా రిజిస్ట్రార్లు, సబ్ రిజిస్ట్రార్లు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.