హైదరాబాద్, ఆగస్టు 29(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో విపత్తుల నిర్వహణ వ్యవస్థను బలోపేతం చేస్తున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. గురువారం సచివాలయంలో వరద కార్యాచరణ ప్రణాళికపై మంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో వరదలపై సంబంధిత శాఖలు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆదేశించారు. రాష్ట్ర స్థాయిలో డిజాస్టర్ మేనేజ్మెంట్ తరఫున టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని చెప్పారు. ఎటువంటి విపత్కర పరిస్థితి ఎదురైనా అధిగమించడానికి వీలుగా అధునాతన పరికరాలను సిద్ధం చేసుకోవాలని కోరారు.
డిజాస్టర్ మేనేజ్మెంట్ బలోపేతానికి తీసుకుంటున్న చర్యలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ వివరించారు. గతంలో 30 బృందాలు ఉండగా దాన్న 70కి పెంచామని, సిబ్బంది సంఖ్య ను 1,800 నుంచి 3,500 వరకు పెంచినట్టు వివరించారు. హైడ్రాకు డిజాస్టర్ మేనేజ్మెం ట్ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని, అందుకు అవసరమైన ప్రతిపాదనలను పంపించాలని హైడ్రా కమిషనర్‌కు సూచించారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్, రెవెన్యూ శాఖ సంయుక్త కార్యదర్శి పాల్గొన్నారు.