హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ) : ‘ఏపీ నిర్మించే బనకచర్ల ప్రాజెక్టుపై కొట్లాడి తీరుతం.. ఈ బనకచర్ల బంక మాకెందుకు? గోదావరి జలాల్లో తెలంగాణ వాటాకు నష్టం రాకుండా ఎంతదాకైనా పోరాడుతం.. తెలంగాణకు దక్కాల్సిన ప్రతి నీటిచుక్క కోసం అన్ని వేదికలపైనా పోరాటం చేస్తం’ అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సెలవిచ్చారు. సోమవారం సచివాలయంలో క్యాబినెట్ భేటీ ముగిసిన అనంతరం మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరితో కలిసి మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. కాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.80 వేల కోట్లతో నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టుతో తెలంగాణకు జరిగే నష్టాన్ని ఎలా నివారిస్తారని, దీనిపై ప్రభుత్వ కార్యాచరణ ఏమిటని విలేకరులు అడిగిన ప్రశ్నలపై పొంగులేటి నీళ్లు నమిలారు.
‘ఆ ప్రాజెక్టుపై ఇప్పటికే ఏపీ సర్కారు దూకుడుగా ముందుకు పోతున్నది.. కేంద్రం కూడా సుముఖంగా ఉన్నది.. ఈ పరిస్థితుల్లో తెలంగాణకు ఎలా న్యాయం చేస్తారు?’ అని అడిగిన ప్రశ్నలకు నవ్వి ఊరుకున్నారు. ఏపీ చేపట్టే జీబీ లింక్‌పై ఏడాదిన్నరగా జరుగుతున్న పరిణామాలు, కావేరి లింక్ పేరిట కేంద్ర సహకారం, తెలంగాణ ప్రభుత్వ క్యాబినెట్లో చర్చ తదితర పరిణామాలపై లోతుగా ఆరా తీస్తే ముఖ్యమంత్రి రేవంత్ ట్రాప్‌లోనే మంత్రివర్గం పడ్డట్టు తెలుస్తున్నది. బనకచర్లపై పైకి చెప్పేది ఒకటి.. లోపల జరిగేది మరోటి అన్నట్టు తెలిసింది. గోదావరి -బనకచర్ల లింక్‌పై కొట్లాడి తీరుతామని మంత్రి చెప్తున్నా చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని మంత్రివర్గం నిర్ణయించినట్టు సమాచారం. గోదావరి వరద జలాలను కేంద్రం నిధులిచ్చే ఇచ్చంపల్లి- నాగార్జున సాగర్ లింక్ ద్వారా పెన్నా బేసిన్‌కు తీసుకువెళ్లే విషయంపై చర్చలకు క్యాబినెట్ సంసిద్ధత వ్యక్తం చేసినట్టు తెలిసింది. సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఆదివారం సచివాలయంలో దాదాపు 5 గంటల పాటు జరిగినసుదీర్ఘ క్యాబినెట్ భేటీలో చివరికి ఎలాంటి కార్యాచరణ ప్రకటించకపోవడం అనుమానాలకు తావిస్తున్నది. క్యాబినెట్ భేటీ అనంతరం మంత్రి పొంగులేటి బకనకచర్లపై కొట్లాడి తీరుతామంటూ పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించినా భేటీలో అలాంటి నిర్ణయాలేవీ తీసుకోలేదని తెలిసింది.
కాళేశ్వరం ప్రాజెక్టు, గోదావరి-బనకచర్ల లింక్, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వాహణ ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నా పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సమావేశానికి డుమ్మా కొట్టడంతో స్థానిక సంస్థల ఎన్నికల అంశాన్ని ఎజెండా నుంచి తొలిగించినట్టు సమాచారం. కాళేశ్వరం, బనకచర్ల ప్రాజెక్టు మీదే దాదాపు 1.45 గంటల పాటు సుదీర్ఘ చర్చ జరగినట్టు సమాచారం. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గంట పాటు ప్రజెంటేషన్ ఇవ్వగా..అనంతరం మంత్రులు 45 నిమిషాలకు పైనే చర్చించినట్టు తెలిసింది. ఈ సమయం అంతా గోదావరి-బనకచర్ల లింక్‌ను ఎలా అపుదామనే అంశం మీద కాకుండా వివాదంపై బీఆర్ఎస్ పార్టీని ఎలా డిఫెండ్ చేయాలనే అంశంపైనే కూడబలుక్కొని చర్చించినట్టు సమాచారం.
2016లో అప్పటి కేంద్ర జల్‌శక్తి మంత్రి ఉమాభారతి ఆధ్వర్యంలో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనూ గోదావరి జలాల తరలింపునకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అంగీకరించారంటూ, గోదావరి వరద నీటిలో 400 టీఎంసీలను పెన్నాకు తరలించేందుకు అప్పుడే పునాది పడిందనే అంశాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని నిర్ణయించినట్టు తెలిసింది. 2020, డిసెంబర్ 22న జరిగిన అపెక్స్ కమిటీ సమావేశంలో కేడబ్ల్యూడీటీ-2 తీర్పు నోటిఫై చేసేంత వరకూ కేడబ్ల్యూడీటీ-1 తీర్పు ప్రకారం ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీల మేర పంపిణీ చేయడానికి అంగీకరించింది కూడా కేసీఆరేననే అంశాన్ని ప్రజలకు వివరించాలన్న అభిప్రాయానికి వచ్చినట్టు తెలిసింది. ఇందుకోసం ముందుగా భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి సీఎల్సీ సమావేశం పెట్టి కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు, ఎమ్మెల్యేలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం.
చంద్రబాబుతో చర్చలకు ఆహ్వానం
పొరుగు రాష్ట్రంతో అనవసర వివాదాలకు పోవాల్సిన అవసరం లేదని, కృష్ణా, గోదావరి నదుల ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ట్రలతో ఎలాంటి సంబంధాలను కోరుకుంటున్నామో..ఆంధ్రప్రదేశ్‌తోనూ అలాంటి సంబంధాలనే కొనసాగిద్దామని సీఎం రేవంత్‌రెడ్డి మంత్రి వర్గానికి సూచించినట్టు సమాచారం. సముద్రంలో కలిసే వరద జలాలనే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అడుగుతున్నారు కాబట్టి, వృథా జలాల ఫీజుబిలిటీ ఎంత మేరకు ఉంటుందో అధ్యయనం చేయాలనే ఆలోచన చేసినట్టు తెలిసింది. అందుకోసం ముఖ్యమంత్రుల స్థాయి సమావేశం ఏర్పాటు చేయాలని, ఇందుకోసం కార్యాచరణ రూపొందించి చంద్రబాబును చర్చలకు ఆహ్వానించాలని నిర్ణయించినట్టు తెలిసింది.
కమిషన్‌కు వివరాలు ఇవ్వాలని నిర్ణయం
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌కు గత బీఆర్ఎస్ ప్రభుత్వ మంత్రివర్గ మినిట్స్‌తో కూడిన పూర్తి నివేదిక ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయించినట్టు మంత్రి పొంగులేటి అధికారికంగానే ప్రకటించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి బాధ్యత అప్పగించారు. పాత ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుకు డిజైన్ మార్చి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును తీసుకొచ్చారని, దానిపై అప్పట్లో అపెక్స్ కౌన్సిల్లో చర్చించారా? లేదా? అనే అంశానికి సంబంధించిన వివరాలను సేకరించి కమిషన్ ముందు పెట్టాలని నిర్ణయించినట్టు తెలిసింది. ప్రాజెక్టు నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదం ఉన్నదా? లేదా? సబ్ కమిటీ మాత్రమే వేశారా? సబ్ కమిటీ ఏం నిర్ణయాలు తీసుకున్నదో వివరాలను కమిషన్‌కు అందించాలని నిర్ణయించినట్టు సమాచారం.
భేటీకి డుమ్మా కొట్టి.. బ్రాండ్ ప్రమోషన్ కోసం
క్యాబినెట్ భేటీకి పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క గైర్హాజరయ్యారు. ఉద్దేశపూర్వకంగానే ఆమె క్యాబినెట్ సమావేశానికి డుమ్మా కొట్టి కేరళ రాష్ర్టానికి చెందిన ఓ ప్రైవేట్ కంపెనీ బ్రాండ్ ప్రమోషన్ కోసం ఆమె దుబాయ్ వెళ్లినట్టు విశ్వసనీయంగా తెలిసింది. కొంత కాలంగా ఆమె ప్రభుత్వ పెద్దల తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, సొంత శాఖలో కూడా తన మాట చెల్లుబాటు కాకుండా రాజకీయాలు చేస్తున్నారనే ఆవేదనతో ఉన్నట్టు సమాచారం. సీఎంతో అత్యంత సన్నిహితంగా మెలిగే ఓ సలహాదారు ఆమె శాఖల్లో వేలు పెడుతున్నారని, ఆమెకు తెలియకుండానే పనులు చక్కదిద్దుకుంటున్నారని తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. అందుకే ఇటీవల మంత్రులకు సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన విందుకు కూడా ఆమె డుమ్మా కొట్టినట్టు మాట్లాడుకుంటున్నారు.
తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటనపై చెలరేగిన వివాదం సీతక్కను మరింత కుంగదీసినట్టు ఆమె సన్నిహితులు చెప్తున్నారు. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా స్థానిక ఎన్నికలపై నాలుగు రోజుల్లో స్పష్టత వస్తుందని ముందే ప్రకటించిన నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు అభ్యంతరం వ్యక్తం చేస్తూ సున్నిత అంశంపై ఎవరూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దని హెచ్చరించారు. ఆయ న హెచ్చరికలకు నొచ్చుకున్న సీతక్క అదే రోజు మీడియా సమావేశం పెట్టి తనకు జ్ఞానం ఉన్నదని క్యాబినెట్లో నిర్ణయం జరగకుండా తానె లా చెప్తానని మహేశ్ కుమార్‌కు ఘాటుగానే బదులిచ్చారు. తన ప్రమేయమే లేనప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ నిర్ణయానికి తానెందుకు అని ఆమె అనధికారిక పర్యటన పెట్టుకొని దుబాయ్ వెళ్లినట్టు తెలిసింది.