New Revenue Act | కొత్త రెవెన్యూ చట్టం ముసాయిదాపై అభిప్రాయ సేకరణ పూర్తయిన నేపథ్యంలో.. చట్టం రూపకల్పనపై దృష్టి సారించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజల నుంచి అభిప్రాయాలు, సలహాలు, సూచనలన్నింటినీ ఒకే దగ్గర పొదుపరిచి పరిశీలించాలన్నారు. ఇందులో రైతాంగానికి ఏది అవసరమో ఆ అంశాలను కొత్త చట్టంలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మారుతున్న కాలానికి, పరిస్థితులకు తగినట్లు భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రజల దశాబ్దాల ఆకాంక్షలకు అనుగుణంగా కొత్త రెవెన్యూ చట్టం తీసుకురాబోతున్నామన్నారు. రెవెన్యూ చట్టం లోపభూయిష్టంగా ఉండడంతో రైతులు, భూ యజమానులు కష్టాలుపడ్డారని.. ధరణితో భూ సమస్యలు పెరిగాయన్నారు. తప్పులు పునరావృతం కాకుండా ఉండేలా మేధావులు, నిపుణులు, రిటైర్డ్ రెవెన్యూ ఉద్యోగులు, ప్రజాప్రతినిథులు, రైతులు, సామాన్య ప్రజల నుంచి కూడా అభిప్రాయాలను స్వీకరించామన్నారు.
ముసాయిదాపై ఈ నెల 2న శాసనసభలో చర్చించి అదేరోజు హైదరాబాద్‌లోని భూపరిపాలన ప్రధాన కార్యాలయంలో పబ్లిక్ డొమైన్లో పెట్టామన్నారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో వర్క్‌షాప్‌లు సైతం నిర్వహించడం జరిగిందన్నారు. జిల్లాస్థాయిలో నిర్వహించిన వర్క్‌షాప్‌లలో వచ్చిన సూచనలను ఒకే నివేదిక రూపంలో కలెక్టర్లు వెంటనే భూపరిపాలన కార్యాలయానికి పంపించాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా విస్తృత స్థాయిలో జరిపిన ప్రజాభిప్రాయ సేకరణలో పెద్ద ఎత్తున సూచనలు వచ్చాయన్నారు. లిఖిత పూర్వకంగా, ఈ-మెయిల్ ద్వారా సూచనలు వచ్చాయన్నారు. సామాన్యులు సైతం పలు సూచనలు చేశారని, అమలు చేసేవారికి అవగాహన ఉండేలా రైతులకు, సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలో అవినీతి రహితంగా చట్టాన్ని తీసుకురాబోతున్నామన్నారు.