హైదరాబాద్, మే 26(నమస్తే తెలంగాణ): భూముల రిజిస్ట్రేషన్లలో ఇకపై ఆధార్ ఈ-సంతకాన్ని అమలు చేయనున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. పైలట్ ప్రాజెక్టుగా తొలుత నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, ఖమ్మం జిల్లా కూసుమంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అమలు చేయనున్నట్టు వెల్లడించారు. తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పారు. సోమవారం సచివాలయంలో రిజిస్ట్రేషన్ల శాఖలో స్లాట్ బుకింగ్ విధానం తదితర అంశాలపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయడంలో భాగంగా ఆధార్ -ఈ సంతకం ప్రవేశ పెడుతున్నట్టు తెలిపారు. పఠాన్ చెరువు, యాదగిరిగుట్ట, గండిపేట, సూర్యాపేట, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు అదనంగా ఎస్ఆర్వోలను నియమించినట్టు చెప్పారు.