హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): ఖమ్మం, వరంగల్ జిల్లా మీదుగా దక్షిణ మధ్య రైల్వే కొత్తగా ఏర్పాటు చేయనున్న రైలు మార్గాల్లోని అలైన్మెంట్లో మార్పులు చేయాలని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్‌జైన్‌కు విజ్ఞప్తి చేశారు. బుధవారం సికింద్రాబాద్ రైల్ నిలయంలో జీఎంతో మంత్రి సమావేశమయ్యారు.
డోర్నకల్ నుంచి ఖమ్మం జిల్లా నాయక్‌గూడెం, సూర్యాపేట మీదుగా గద్వాల వరకు ప్ర తిపాదించిన రైలుమార్గం గురించి చర్చించారు. దీనివల్ల రైతులు సాగు భూములు కోల్పోవాల్సి వస్తున్నదని పేర్కొన్నారు. కుడా మాస్టర్‌ప్లాన్‌ను పరిగణనలోకి తీసుకొని వరంగల్ బైపాస్ రైల్వే లైన్‌ను నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.
గాంధీ, ఉస్మానియాల్లో కాంట్రాక్ట్ వైద్యుల భర్తీ
హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): గాంధీ, ఉస్మానియా దవాఖానల్లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి వైద్యారోగ్యశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్ట్ పద్ధతిలో 235 మంది వివిధ స్థాయి డాక్టర్లను వాకిన్ ఇంటర్వ్యూ పద్ధతిలో భర్తీ చేస్తామని తెలిపింది. 9న ఉదయం 10.30 గంటలకు గాంధీ మెడికల్ కాలేజ్ పరిపాలన భవనంలో, ఉస్మానియా మెడికల్ కాలేజ్ అకాడమిక్ బ్లాక్‌లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. 12న ధ్రువపత్రాల పరిశీలన, 13న అభ్యంతరాల స్వీకరణ, 14న తుది జాబితాను ప్రకటించనున్నారు. హైదరాబాద్ కలెక్టర్ / అదనపు కలెక్టర్, డీఎంఈ, టీవీవీపీ కమిషనర్ నోడల్ అధికారులుగా వ్యవహరించనున్నారు.
తప్పుచేసినట్టు రుజువైతేనే కండక్టర్‌ను తొలగించాం
హైదరాబాద్, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ) : జనగామ ఆర్టీసీ డిపోలోని కండక్టర్‌ను అకారణంగా విధుల నుంచి తప్పించారన్న ప్రచారంలో నిజం లేదని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పష్టం చేశారు. ఈ నెల 1న ఓ మహిళ తన తల్లి, ఏడాది కుమారుడితో కలిసి హన్మకొండ నుంచి హైదరాబాద్‌కు జనగామ డిపో బస్సులో మొదటి వరుసలో కూర్చోగా ఆ సీట్లను ఖాళీ చేయాలంటూ కండక్టర్ శంకర్ దురుసుగా ప్రవర్తించారన్నారు. మార్గమధ్యంలో వారిని దించినట్టు తేలడంతో కండక్టర్‌ను విధుల నుంచి తప్పించామని పేరొన్నారు. రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులను పెంచకుండా సిబ్బందిపై చర్య తీసుకోవడం అన్యాయమని ఐఎన్టీయూసీ నేత రాజిరెడ్డి పేర్కొన్నారు.