హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్ విలువలను పెంచుతున్నట్టు రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. ఈ నిర్ణయం శుక్రవారం నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు. బహిరంగ మార్కెట్ ధరకు, ప్రభుత్వ ధరకు మధ్య భారీ వ్యత్యాసం ఉన్నదని, ఈ వ్యత్యాసాన్ని తగ్గించేలా భూముల ధరలను సవరించినట్టు పేర్కొన్నారు. అపార్ట్మెంట్లలో కొన్నిచోట్ల అన్ని ఫ్లోర్లకు ఒకే రకమైన ధరను నిర్ణయించినట్టు తెలిపారు. హెచ్ఎండీఏ, క్యూర్ పరిధిలో, ఇతర ప్రాంతాల్లో వ్యవసాయ భూములు, ఓపెన్ ప్లాట్లు, ఫ్లాట్లకు కనీస ధరలను ఖరారు చేశామని చెప్పారు. సర్కార్ నిర్ణయంతో శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో వ్యవసాయ భూములు, ఓపెన్ ప్లాట్లు, అపార్ట్మెంట్ ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ ధరలు భారీగా పెరుగనున్నాయి. ఓఆర్ఆర్, ట్రిపుల్ఆర్ పరిధిలో ప్రస్తుత ధరలపై 100శాతం పెరిగే అవకాశం ఉన్నది. భూముల విలువ పెంపుతో ప్రజల నెత్తిపై అనివార్యంగానే రిజిస్ట్రేషన్ చార్జీల భారం కూడా పడనున్నది. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ధరలను ప్రభుత్వం భారీగా పెంచిన నేపథ్యంలో రంగారెడ్డిలో ఎకరం ధర రూ.10 కోట్లకు చేరింది. శేరిలింగంపల్లిలో ఎకరం ధర రూ.30 కోట్లుగా ఖరారు చేశారు.
గ్రామీణ ప్రాంతాల్లోనూ వ్యవసాయ భూముల ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం ఎకరం ధర కనిష్ఠంగా రూ.75 వేలు ఉండగా దీన్ని ప్రభుత్వం రూ.2.75 లక్షలకు పెంచింది. అంటే పల్లెటూళ్లలో ఎకరం ధర ఏకంగా 266.66 శాతం పెరిగింది. హను మకొండలో ఎకరం ధరను రూ.3 కోట్లుగా నిర్ణయించినట్టు తెలిసింది. ఇక క్యూర్ పరిధిలో వ్యవసాయ భూముల ధరలను కనిష్ఠంగా రూ.15 లక్షలుగా నిర్ణయించినట్టు తెలిసింది. పాత హెచ్ఎండీఏ పరిధిలో ఎకరం ధరను రూ.10 లక్షలుగా నిర్ణయించినట్టు సమాచారం. మున్సిపాలిటీల్లో వ్యవసాయ భూముల ధరలను ఎకరానికి కనిష్ఠంగా రూ. 5 లక్షలుగా నిర్ణయించినట్టు తెలిసింది. రోడ్ల పక్కన, హైవేల పక్కన వ్యవసాయ భూముల ధరలను భారీగా పెంచినట్టు సమాచారం.
ఓపెన్ ప్లాట్లు.. అపార్ట్మెంట్లపై బాదుడు
ఓపెన్ ప్లాట్లు, అపార్ట్మెంట్ ఫ్లాట్లపై ధరలు కూడా భారీగా పెరిగాయి. క్యూర్ పరిధిలో ఓపెన్ ప్లాట్ ధర గజానికి కనీసం రూ.1,500 ఉండగా దీన్ని రూ.3 వేలకు పెంచినట్టు తెలిసింది. అపార్ట్మెంట్ ఫ్లాట్లకు రూ.2వేలు నిర్ణయించగా గరిష్ఠంగా రూ.6,500 నుంచి రూ. 8 వేలుగా నిర్ణయించినట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పాత హెచ్ఎండీఏ పరిధిలో ఓ పెన్ ప్లాట్ల ధరలను కనిష్ఠంగా రూ.2వేలుగా నిర్ణయించినట్టు తెలిసింది. ఇక్కడ అపార్ట్మెంట్ ఫ్లాట్ల ధరలను రూ.1,500గా నిర్ణయించినట్టు సమాచారం. క్యూర్ పరిధిలో ఓపెన్ ప్లాట్లు, అపార్ట్మెంట్ ఫ్లాట్ల ధరలను ప్రస్తుత ధరలపై కనీసంగా 75% పెంచినట్టు ఆ వర్గాలు పేర్కొన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇది 100 శాతం ఉన్నట్టు తెలిసింది.
4వేల కోట్ల ఆదాయమే లక్ష్యం
భూముల ధరలను ఎంతో శాస్త్రీయంగా పెంచినట్టు మంత్రి పొంగులేటి చెప్పారు. శాస్త్రీయత ప్రకటనలకే పరిమితమైందని, పూర్తి అశాస్త్రీయంగా ధరలు పెంచారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవడమే లక్ష్యంగా ధరలు పెంచినట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భూ ముల విలువలను పెంచడం ద్వారా ప్రతియేట రూ.1,000 కోట్ల నుంచి 1,500 కోట్ల వరకు అదనపు ఆదాయం వస్తుందని ప్రభుత్వవర్గాలు అంచనా వేస్తున్నాయి. కానీ అస లు లక్ష్యం మాత్రం ప్రతియేటా రూ.4-5 వేల కోట్ల అదనపు ఆదాయం రాబట్టుకునేలా భూముల విలువలను పెంచినట్టు తెలుస్తున్న ది. ఓఆర్ఆర్, హెచ్ఎండీఏ పరిధి నుంచి భారీగా ఆదాయాన్ని దండుకునేందుకు స్కెచ్ వేసినట్టు పరిశీలకులు భావిస్తున్నారు.
రియల్‌పై ప్రభావం.. ప్రజలపై భారం
అడ్డగోలు విధానాలతో రియల్ ఎస్టేట్ రం గాన్ని కుదేలు చేసిన కాంగ్రెస్ సర్కార్.. ఇప్పు డు భూముల ధర పెంపుతో మరో పిడుగు వేసిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతంతమాత్రంగా సాగుతున్న వ్యాపారంపై భూముల ధర పెంపు భారీ ప్రభావాన్ని చూపుతుందని రియల్ ఎస్టేట్వర్గాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. భూములు, అపార్ట్మెంట్ల ఫ్లాట్లు కొనుగోలు చేసేందుకు ప్రజలు ముందుకొచ్చే పరిస్థితి లేదని అంటున్నాయి.
15 నుంచి 100 శాతం పెంపు
బహిరంగ మార్కెట్ ధరలకు, ప్రభుత్వ ధరలకు మధ్యగల వ్యత్యాసాన్ని అంచనా వేసిన సర్కార్.. భూములు, అపార్ట్మెంట్ ఫ్లాట్ల ధరలను ఆయా ప్రాంతాలను బట్టి కనిష్ఠంగా 15 శాతం, గరిష్ఠంగా 100 శాతం పెంచింది. బహిరంగ మార్కెట్ ధర, ప్రభుత్వ ధర మధ్య వ్యత్యాసం 20 శాతంలోపు ఉంటే అక్కడ ధరలను పెంచలేదు. వ్యత్యాసం 20-50 శాతం మధ్య ఉంటే అక్కడ 15 శాతం పెంచింది. ఇక 50-100 శాతం వ్యత్యాసం ఉంటే అక్కడ 25 శాతం, 100-200 శాతం వ్యత్యాసం ఉంటే 50 శాతం, 200-500 శాతం వ్యత్యాసం ఉంటే 75 శాతం, 500 శాతంవరకు వ్యత్యాసం ఉన్నచోట 100శాతం ధరలను పెంచింది.