వరంగల్ : రాష్ట్రవ్యాప్తంగా రైతు రుణమాఫీకి( Loan waiver) రూ.19వేల కోట్ల నిధులు మంజూరు చేశామని, మరో రూ.12వేల కోట్లు త్వరలోనే మంజూరు చేసి త్వరలోనే రైతులందరికీ రుణమాఫీని పూర్తి చేస్తామని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti) అన్నారు. హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని నూతన మున్సిపాలిటీ భవనంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, ఎంపీ కడియం కావ్య, కలెక్టర్ ప్రావిణ్యతో కలిసి అమృత్ పథకం-2లో భాగంగా రూ. 11.74కోట్లతో పలు అభివృద్ధి పనులు, రూ.5కోట్లతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
అనంతరం మున్సిపాలిటీ కార్యాలయంలో నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర రాజధానిలో జరిగిన పలు సమీక్షల్లో పరకాల అభివృద్ధిపై చర్చించామన్నారు. టెక్స్టైల్ పార్కును దేశంలోనే రోమ్ మోడల్ పార్కుగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్ ఆలోచనలో ఉందన్నారు. గ్రీన్‌ఫీల్డ్ హైవేలో భూమి కోల్పోయిన రైతులకు మంచి ధర చెల్లించి అండగా ఉంటామని, భూ సేకరణ పూర్తి చేసి కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తామని హామీ ఇచ్చారు.